Share News

ఇళ్లపైకి ఎగబడ్డ ఏనుగులు

ABN , Publish Date - Dec 14 , 2025 | 02:13 AM

సోమలవాసులను గజరాజులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజులుగా సోమల, ఇరికిపెంట పంచాయతీల్లోనే సంచరిస్తూ మధురమలై కొండనే ఆవాసం చేసుకున్నాయి.

ఇళ్లపైకి ఎగబడ్డ ఏనుగులు
ఏనుగులు ధ్వంసం చేసిన పైపులు

సోమల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సోమలవాసులను గజరాజులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజులుగా సోమల, ఇరికిపెంట పంచాయతీల్లోనే సంచరిస్తూ మధురమలై కొండనే ఆవాసం చేసుకున్నాయి. శుక్రవారం రాత్రి నెలుకూరివారిపల్లె సమీపంలో నాగన్న వరి కోతలు చేసి పంటను ఒబ్బిడి చేసి ఇంటి ఆవరణలోని బండపై బస్తాలో నిల్వ ఉంచగా ఏనుగులు తిన్నంతా తిని బస్తాలను తొక్కేశాయి. గురువారం రాత్రి నాగన్న పొలం వద్ద ధాన్యపు నిల్వలను ధ్వంసం చేసి మళ్లీ అక్కడికే రావడంతో మరోసారి పంటను కోల్పోయాడు. రాత్రి 7 గంటలకే అక్కడికి ఏనుగులు రావడం గుర్తించి కుటుంబ సభ్యులంతా ఇంటి మిద్దెపైకి వెళ్లారు. వారిపైకి దాడి చేయడానికి ప్రయత్నించాయి. ప్రాణ భయంతో అక్కడి నుంచే రైతులు టపాసులు పేల్చడంతో అక్కడి పైపులను, మోటరును ధ్వంసం చేసి మరో వైపు వెళ్లడం రైతులు గుర్తించారు.సోమలకు చెందిన పోలూరు చలపతి, శ్రీనివాసులు, నెలుకూరిపల్లెకు చెందిన నరసింహులు, మేకల గంగాధరం, గంగులప్ప పొలాల్లోని వరి, కొబ్బరి, మామిడి కొమ్మలను, బోరుపైపులను, డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేసి సాగులోకి తెచ్చుకున్న పంటలను రాత్రికి రాత్రే ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం వద్దనే అడవిపందుల నుంచి పంటను రక్షించుకోవడానికి కాపుగాస్తున్న రైతులు ఏనుగుల సంచారం గుర్తించి గ్రామానికి చేరుకున్నారు. శనివారం సోమల సింగిల్‌ విండో అధ్యక్షుడు పీవీ శివశంకర్‌, సోమల టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహేంద్రకుమార్‌, చాణుక్య తదితరులు ఏనుగులు దాడులు చేసిన ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. నష్టపరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 14 , 2025 | 02:13 AM