పాడిఆవుపై గజ దాడి
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:33 AM
వరి పంటను తొక్కినాశనం చేసిన ఒంటరి ఏనుగు అక్కడే ఉన్న ఓ పాడిఆవును దంతాలతో పొడవగా ఆది తీవ్రంగా గాయపడింది.
బంగారుపాళ్యం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):వరి పంటను తొక్కినాశనం చేసిన ఒంటరి ఏనుగు అక్కడే ఉన్న ఓ పాడిఆవును దంతాలతో పొడవగా ఆది తీవ్రంగా గాయపడింది. బంగారుపాళ్యం మండలం టేకుమంద బీటు పరిధిలోని మామిడిమానుకుంట సమీపంలో మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు వరి పొలాల్లోకి చొరబడి పంటను తొక్కి నాశనం చేసింది. టేకుమందకు చెందిన చంద్ర,జ్యోతీశ్వరయ్యలకు చెందిన వరి,అరటి పంటలను ధ్వంసం చేసింది. అదే గ్రామానికి చెందిన జానకిరామయ్య తన పాడిఆవును పొలం వద్ద కట్టేయగా ఏనుగు దంతాలతో దానిపొట్టపై పొడవడంతో పేగులు బయటకు వచ్చేశాయి. వీటి పెనుగులాటలో ఆవు కొమ్ములు కూడా విరిగిపోయాయని జానకిరామయ్య చెప్పాడు.రోజుకు 24 లీటర్ల పాలు ఇచ్చే ఆవు ప్రాణాపాయ స్తితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజులుగా టేకుమంద,మొగిలివారిపల్లె. మొగిలి గ్రామ సమీపంలోని అటవీప్రాంతాల్లో 13 ఏనుగుల గుంపుతో పాటు ఈ ఒంటరి ఏనుగు పంటపొలాలపై దాడులు చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నెల 11వ తేదీన కౌసల్య,గోవిందయ్య,రేణుకమ్మలకు చెందిన వరి,మామిడి పంటలను ఏనుగులు నాశనం చేశాయని తెలిపారు. పొలాల వద్ద రాత్రి వేళ మంటలు వేసుకుని పంటలకు కాపలా కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.