మూతపడిన ఇంటికి రూ.28438 కరెంటు బిల్లు?
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:33 AM
మూతపడిన ఇంటికి ఏకంగా నెలకు రూ.28438 కరెంటు బిల్లు వచ్చింది. ఈ ఘటన కార్వేటినగరం మండలంలో వెలుగు చూసింది.
వెదురుకుప్పం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మూతపడిన ఇంటికి ఏకంగా నెలకు రూ.28438 కరెంటు బిల్లు వచ్చింది. ఈ ఘటన కార్వేటినగరం మండలంలో వెలుగు చూసింది. మండలంలోని టీకేఎంపేట గ్రామ పంచాయతీ ఎగువ రాజులకండ్రిగ గ్రామంలో ఓ ఇంటికి సర్వీసు నెంబరు-5634321000288తో ఉంది. ఆ ఇంటి యజమాని పేరు ఎన్.సుబ్బమ్మ. ఆమె కొన్నేళ్ల కిందటే చనిపోయింది. ఆమె వారసుడు దామోదరరాజు బెంగళూరులో స్థిరపడ్డారు. ఈ ఇంటిని ఆయన మూతవేసి ఉన్నారు. ఈ ఇంటి విద్యుత్ బిల్లును పక్కింట్లో ఉన్న బంధువు వద్ద నెలనెలా ఇస్తారు. ఈ విధంగా 3.6.2025 నుంచి 3.7.2025వ తేదీ వరకు రూ.64 విద్యుత్ బిల్లు వచ్చిందని, మిగులుగా రూ.172 ఉందని చూపించారు. వినియోగించిన విద్యుత్ యూనిట్లు శూన్యంగా ఉంది. అయితే 3.7.2025 నుంచి 3.8.2025 తేదీవరకు అదే సర్వీసులో 3030 యూనిట్లు వినియోగించారని, దానికోసం రూ.28438 బిల్లు చెల్లించాలని, దీనిలో మిగులుగా ఉన్న రూ.172 తగ్గించి రూ.28266 కట్టాలని విద్యుత్ బిల్లు వచ్చింది. దీన్నిచూసిన వారంతా షాకయ్యారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏం జరిగిందనేది విద్యుత్ శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది.