Share News

పక్కా ఇళ్ల కోసం కసరత్తు

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:12 AM

పేదలు పక్కా ఇండ్లను నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సహకారం అందించనుంది.అర్హుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది. జాబితా సిద్ధమయ్యాక కేంద్ర ప్రభుత్వ వాటాకు, రాష్ట్ర వాటా కూడా జత కానుంది. రాష్ట్ర వాటా నయాపైసా ఇవ్వని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి పేదలు తీవ్ర ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

 పక్కా ఇళ్ల కోసం కసరత్తు
:వి.కోట మండలంలోని పాపేపల్లిలో మొండి గోడలతో దర్శనమిస్తున్న జగనన్న లేఅవుట్‌-3

రేషన్‌ కార్డు, సొంత స్థలం ఉండడమే అర్హత

అర్హుల కోసం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల సర్వే

సచివాలయాల్లో దరఖాస్తుకు అవకాశం

నెలాఖరు వరకు గడువు పొడిగింపు

40వేల దరఖాస్తులు వస్తాయని అంచనా

చిత్తూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పేదలు పక్కా ఇండ్లను నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సహకారం అందించనుంది.అర్హుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది. జాబితా సిద్ధమయ్యాక కేంద్ర ప్రభుత్వ వాటాకు, రాష్ట్ర వాటా కూడా జత కానుంది. రాష్ట్ర వాటా నయాపైసా ఇవ్వని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి పేదలు తీవ్ర ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 40,335 మంది ఇంటి నిర్మాణానికి హౌసింగ్‌ శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో 1457మందికి సొంత స్థలం లేదు. మిగిలినవారి వివరాలను క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుడి ఫొటోతో పాటు ఆ స్థలాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సొంత స్థలమున్నవారికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

జియో ట్యాగ్‌తో అర్హుల లెక్క పక్కా

కేంద్ర ప్రభుత్వం పీఎంఏవైజీ (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌) పథకంలో భాగంగా అర్హుల వివరాలను అప్లోడ్‌ చేయమని ఓ యాప్‌ను రూపొందించింది. అందులో అర్హుల వివరాలు మాత్రమే కాకుండా ఇంటి స్థలమున్న ప్రాంతాన్ని జియో ట్యాగింగ్‌ కూడా చేయాల్సి ఉంది. ఈ గడువు ఈ నెల 5వ తేదీతో ముగియగా, యాప్‌ సరిగా పనిచేయని కారణంగా వివరాలను సరిగా నమోదు చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు దాకా గడువు పొడిగించింది. నెలాఖరులోగా అర్హుల వివరాలను యాప్‌లో అప్లోడ్‌ చేస్తామని హౌసింగ్‌ అధికారులు చెబుతున్నారు.

వైసీపీ హయాంలో ఇబ్బందులు

వైసీపీ హయాంలో కేంద్రం 73 వేల ఇళ్లను మంజూరు చేసి.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల యూనిట్‌ కాస్ట్‌తో పాటు రూ.30 వేల ఉపాధిహామీ నిధుల్ని అందించింది. దీనికి అప్పటి వైసీపీ ప్రభుత్వం అదనపు వాటా ఇవ్వలేదు. దీంతో నిర్మాణానికి ఆ డబ్బులు సరిపోక, కొండల్లో గుట్టల్లో ఇచ్చిన పట్టా నివాసయోగ్యంగా లేక.. చాలా మంది పేదలు ఇళ్లను నిర్మించుకోలేదు. తన వాటా నయాపైసా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ఆయా కాలనీలకు జగనన్న కాలనీలంటూ పేరు పెట్టుకుంది.

అప్పట్లోనే రాష్ట్ర వాటా వేసిన టీడీపీ

2014-19 మధ్య కూడా కేంద్రం రూ.1.50 లక్షలు సాయమే అందించింది. అయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం అదనంగా తన వాటా రూ.లక్ష వేసి.. యూనిట్‌ కాస్ట్‌ను రూ.2.50 లక్షలుగా చేసింది. దీంతో అప్పట్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా జరిగాయి. ఈసారి కూడా రాష్ట్ర వాటా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు.

ఈసారి పెరగనున్న యూనిట్‌ కాస్ట్‌

కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఇదివరకే ప్రకటించింది. పట్టణాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.1.59 లక్షలుగా యూనిట్‌ కాస్ట్‌ను నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షల బేసిక్‌ యూనిట్‌ కాస్ట్‌కు అదనంగా ఉపాధిహామీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్‌ కింద రూ.12 వేలను ఇస్తున్నారు. ఇలా మొత్తంగా రూ.1.59 లక్షలు అందనున్నాయి. ఇదంతా కేంద్ర వాటానే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఇవ్వనుంది. అయితే ఎంత అనేది ఇంకా స్పష్టత రాలేదు. కనీసం రూ.లక్షకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే, రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రభుత్వాల సాయం ఉంటుంది.

రూ.2.50 లక్షలతో కొత్తగా 2472 గృహాలు

రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం బుధవారం పండుగలా గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా జిల్లాలో 10,168 మందికి ఇంటి తాళాలు అందించిన విషయం తెలిసిందే. పీఎంఏవైజీలో భాగంగా ఓ వైపు జిల్లాకు 40 వేల గృహాల మంజూరుకు సర్వే జరుగుతుండగా.. మరోవైపు 2472 గృహాలను కొత్తగా మంజూరు చేశారు. 5 మున్సిపాలిటీలతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఈ కొత్త గృహాల్ని కేటాయించారు. వీటికి కేంద్రం ఇచ్చే రూ.1.50 లక్షలతో పాటు రాష్ట్రం కూడా రూ.లక్ష వేసి మొత్తంగా రూ.2.50 లక్షల్ని అందించనుంది. పీఎంఏవైజీలో మంజూరయ్యే గృహాలకు రాష్ట్ర వాటా ఖరారవ్వని విషయం తెలిసిందే.

Updated Date - Nov 14 , 2025 | 01:12 AM