Share News

1529కి చేరిన డీఎస్సీ అభ్యర్థులు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:09 AM

జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల సంఖ్య పెరిగినట్లు డీఈవో తెలిపారు

 1529కి చేరిన డీఎస్సీ అభ్యర్థులు

చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల సంఖ్య పెరిగినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ జోనల్‌ పరిధిలోని మోడల్‌ స్కూల్లో (పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ట్రైండ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌) 121మంది టీచర్లు డీఎస్సీ ద్వారా ఎంపికైనట్లు తెలిపారు.వీరు కాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1478 పోస్టులకు గాను 1408 మంది ఎంపికైన విషయం తెలిసిందే. ఇదే జాబితాలో జోనల్‌ పరిధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 121 మంది టీచర్‌ పోస్టులకు ఎంపిక కావడంతో మొత్తంగా 1529 మంది టీచర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. వీరందరికీ గురువారం అమరావతిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి సహాయకులను బుధవారం విజయవాడ తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీరితో పాటు విద్యాశాఖ సిబ్బంది, సహాయకులు కలుపుకుని ప్రయాణం చేసేందుకు వీలుగా 84 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బస్సులో ఎంఈవో/హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, పీడీ/పీఈటీలను పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు బుధవారం ఉదయం 7 గంటలకు తిరుపతి- రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్‌ కళాశాల వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరికి అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీలుగా ఎంపికైన అభ్యర్థులకు విడివిడిగా వాటప్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, ఎప్పుడు ఎక్కడికి ఎలా చేరుకోవాలి, విజయవాడలో ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఎక్కడ, ఎవరు ఉండాలనే సమాచారం క్షుణ్ణంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. రెండు బ్యాచ్‌లుగా విభజించి, ప్రయాణ సమయంలో గూడూరు, ఒంగోలు ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు చేశామన్నారు.చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, పుత్తూరు డీవైఈవోలు వీటన్నింటినీ పర్యవేక్షిస్తారన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:09 AM