రేపు విజయవాడకు డీఎస్సీ అభ్యర్థుల పయనం
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:22 AM
మెగా డీఎస్సీ 2025లో భాగంగా నియామక పత్రాలు అందుకోవడానికి అభ్యర్థులు బుధవారం విజయవాడకు పయనం కానున్నారు. మెరిట్ ఆధారంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,408 మంది అభ్యర్థులు ఎంపికైన విషయం తెలిసిందే.
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ 2025లో భాగంగా నియామక పత్రాలు అందుకోవడానికి అభ్యర్థులు బుధవారం విజయవాడకు పయనం కానున్నారు. మెరిట్ ఆధారంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,408 మంది అభ్యర్థులు ఎంపికైన విషయం తెలిసిందే. వీరికి బుధవారం విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌లు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులతోపాటు సహాయకులను విజయవాడకు ప్రత్యేక బస్సుల్లో పంపడానికి చిత్తూరు-తిరుపతి విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు బుధవారం ఉదయం ఏడు గంటలకు తిరుపతి- రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవాలని డీఈవో వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కాల్ లెటర్, ఆధార్ కార్డులతో రిపోర్టు చేయాలని సూచించారు. దుప్పటి, దిండు, గొడుగు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులకు, సహాయకులకు ఐడీ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఫొటోలు తీసుకురావాలన్నారు. బస్సు బయల్దేరే ప్రాంగణంలో అల్పాహారం ఏర్పాటు ఉంటుందని వివరిఆంచారు.
డ్యూటీ సిబ్బందిని పట్టించుకోలేదా?
డీఎస్సీ అభ్యర్థులను విజయవాడకు తీసుకెళ్లడానికి డ్యూటీ వేసిన సిబ్బందిని విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలొస్తున్నాయి. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, పీడీ, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఈ డ్యూటీ వేశారు. వీరంతా వారి ప్రాంతాల నుంచి సొంత ఖర్చులతో తిరుపతికి చేరుకోవాలి. ఇందుకోసం అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టీఏ, డీఏ ఇస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదని సమాచారం.