‘ప్లాట్‌ఫాం’ కోసం డ్రైవర్లు, కండక్టర్ల గొడవ
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:25 AM
అరుపులు, కేకలతో దద్దరిల్లిన చిత్తూరు ఆర్టీసీ బస్టాండు

చిత్తూరు రూరల్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి ప్లాట్‌ఫాం’ కోసం చిత్తూరు వన్, టూ డిపోలకు చెందిన బస్సు డ్రైవర్లు, కండక్టర్ల మధ్య గొడవ చెలరేగింది. వీరి అరుపులు, కేకలతో చిత్తూరు ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం దద్దరిల్లింది. కొన్ని నెలలుగా రెండు డిపోల మధ్య బస్సులు తిరిగే రూట్ల విషయంలో వివాదాలున్నాయి. శనివారం జరిగిన ఈ గొడవతో అది బహిర్గతమైంది. కొన్ని రోజుల కిందట గంగాధరనెల్లూరు రూట్‌లో తిరుగుతున్న టూడిపో బస్సులను సడెన్‌గా తిరుపతి రూట్‌కు తిప్పడంతో వన్‌డిపోకు చెందిన ఉద్యోగులు టూడిపో అధికారులను ప్రశ్నించారు. ఆపై రాతపూర్వకంగా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. తామే తిరుపతి రూట్ తిప్పాలని వన్‌డిపో కార్మికులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రెండు డిపోలకు చెందిన బస్సులతో తిరుపతి ప్లాట్‌ఫాం వద్దకొచ్చారు. తమ బస్సులనే ముందు పెట్టాలని రెండు డిపోల ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు రెండు డిపోలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో గొడవగా మారింది. ఈ గందరగోళంలో వన్ డిపో బస్సు వెనుకవైపున మరో బస్సు ఢీకొట్టడంతో కాస్త మరమ్మతుకు గురైంది. ఈ గొడవలన్నిటికీ టూడిపోకు చెందిన అధికారే కారణమని బహిరంగంగానే ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎవరు బస్సులు తిప్పినా ఆర్టీసీకేకదా లాభం వస్తుందన్న విషయాన్ని కూడా మరిచి ఇలా గొడవలు పడడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.