ఆ ఇద్దరు అన్యమతస్తులను కొనసాగించకండి
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:42 AM
శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌లో ఇద్దరు అన్యమత ఉద్యోగులను తొలగించాలని టీటీడీ ఈవో ఆదేశించారు.
తిరుమల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌లో పనిచేస్తున్న ఇద్దరు అన్యమత ఉద్యోగులను తొలగించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీ, ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఎండీ ఖైసర్ పాషాను విధుల నుంచి తొలగించాలన్నారు. ఈనెల 31వ తేదీతో వారి కాంట్రాక్ట్ గడువు ముగుస్తుందని, అనంతరం వారిని కొనసాగించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన సోమవారం ఎస్వీబీసీ విభాగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్‌డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారాలను అందించాలని ఆదేశించారు. ఎస్వీబీసీ ఛానల్ ఇప్పటి వరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్‌లు 12 సెకన్లు మాత్రమే ఇస్తున్నారని, వాటిని 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరో రెండేళ్లు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో ఎస్వీబీసీ బోర్డు సభ్యులు ఆనంద్‌సాయి, ఎంఎస్ రాజు(వర్చువల్), ఇన్‌ఛార్జ్ సీఈవో పణికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.