తిరుపతికి సైన్స్‌సిటీ లేనట్టేనా?
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:45 AM
ప్రతిష్ఠాత్మక సైన్స్‌సిటీని తిరుపతి కోల్పోతోందా? చంద్రబాబు ఆలోచనల్లోంచి పురుడుపోసుకుని తిరుపతిలో స్థల ఎంపిక కూడా పూర్తయిన ఈ ప్రాజెక్టును ఆతర్వాత జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో చంద్రబాబు సారధ్యం లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మళ్లీ సైన్స్‌సిటీ పట్టాలెక్కుంతుందని అంతా ఆశపడ్డారు. అయితే ఏపీ సైన్స్‌సిటీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. తిరుపతితో పాటూ అమరావతిలో కూడా సైన్స్‌సిటీలు ఏర్పాటు చేస్తారా? లేక తిరుపతి బదులుగా అమరావతిలో ఏర్పాటు చేస్తారా అనే స్పష్టత లేకపోవడం అయోమయానికి దారి తీస్తోంది. గతంలో చంద్రబాబే స్వయంగా తిరుపతిలో ప్రకటించి, తనే శంకుస్థాపన చేసిన నేపధ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ప్రతిష్ఠాత్మక సైన్స్‌సిటీని తిరుపతి కోల్పోతోందా? చంద్రబాబు ఆలోచనల్లోంచి పురుడుపోసుకుని తిరుపతిలో స్థల ఎంపిక కూడా పూర్తయిన ఈ ప్రాజెక్టును ఆతర్వాత జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో చంద్రబాబు సారధ్యం లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మళ్లీ సైన్స్‌సిటీ పట్టాలెక్కుంతుందని అంతా ఆశపడ్డారు. అయితే ఏపీ సైన్స్‌సిటీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. తిరుపతితో పాటూ అమరావతిలో కూడా సైన్స్‌సిటీలు ఏర్పాటు చేస్తారా? లేక తిరుపతి బదులుగా అమరావతిలో ఏర్పాటు చేస్తారా అనే స్పష్టత లేకపోవడం అయోమయానికి దారి తీస్తోంది. గతంలో చంద్రబాబే స్వయంగా తిరుపతిలో ప్రకటించి, తనే శంకుస్థాపన చేసిన నేపధ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
ఆగమేఘాలపై అలిపిరి దగ్గర 70 ఎకరాలు
సైన్స్‌సిటీ కోసం అనువైన భూముల కోసం అన్వేషణ మొదలైంది. తిరుపతిలో అలిపిరి సమీపంలో అప్పటికే రీజనల్ సైన్స్ సెంటర్, ఎస్వీ జూపార్కు ఉన్నందున ఈ ప్రాంతం ఉపయోగకరమని భావించారు. టీటీడీకి చెందిన 70 ఎకరాలను గుర్తించారు. సర్వే నంబరు 588-ఏలో 50.96 ఎకరాలు, సర్వే నంబరు 589లో 19.15 ఎకరాలు చొప్పున మొత్తం 70.11 ఎకరాలు ఏపీ సైన్స్ సిటీకి లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు టీటీడీ అంగీకరించింది. ఇందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబరు 365ను 2017 ఆగస్టు 16న జారీ చేసింది. 2017 జనవరి 4న సీఎం చంద్రబాబు ఏపీ సైన్స్ సిటీకి శంకుస్థాపన కూడా చేశారు. ఇక్కడిదాకా ఆగమేఘాలమీద జరిగిన పనులు ఆ తర్వాత మందగించాయి. నిర్వహణ, నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. రెండేళ్ల పాటూ పనులు ముందుకు కదల్లేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
చంద్రబాబు పురుడు పోశారు
తిరుపతిలో 2017 జనవరిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. నోబెల్ గ్రహీతలు సహా దేశవిదేశాల నుంచీ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన మహామహులంతా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఆతిధ్యం ఇచ్చింది. అప్పట్లో సీఎం చంద్రబాబు మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. సైన్స్ సంబరాలను చూసిన చంద్రబాబు, రాష్ట్రంలో సైన్సు, సాంకేంతిక పరిశోశనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రెండు కీలక ప్రకటనలు చేశారు. అందులో ఒకటి.. ఏపీ నుంచి నోబెల్ గ్రహీత అయినవారికి రూ.పదికోట్ల నగదు బహుమతి ఇస్తామన్నది. రెండోది.. సైన్స్‌కాంగ్రె్‌సకి ఆతిథ్యం ఇచ్చిన తిరుపతి నగరంలో సైన్స్‌సిటీ నిర్మిస్తామన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు ఇది.
జగన్ ఎసరు పెట్టారు
2019 జూన్‌లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే సైన్స్‌సిటీని అటకెక్కించే ప్రక్రియ మొదలైంది. సైన్స్‌సిటీ రద్దు అనే మాట అనకుండా దానికి కేటాయించిన భూములను తెలివిగా లాగేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే అద్భుతమైన స్పిరిచ్యువల్ సిటీని నిర్మించబోతున్నామని టీటీడీ పాలక మండలితో అక్టోబరు 23న తీర్మానం చేయించారు. దీనికి 500 ఎకరాలు అవసరమని ప్రతిపాదించారు. సైన్స్‌సిటీకి కేటాయించిన 70.11 ఎకరాలు వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. అప్పటి టీటీడీ ఈవో జవహర్ రెడ్డి లేఖలతో వెంటబడడంతో ఏపీ సైన్స్ సిటీకి ఇచ్చిన భూముల భూముల కేటాయింపును వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తూ 2020 జూన్ 4న జీవోఎంఎస్ నంబరు 167 జారీ చేసింది. స్పిరిచ్యువల్ సిటీ నిర్మాణానికి ఈ భూములను కేటాయించారు.
గాల్లోనే స్పిరిచ్యువల్ సిటీ
స్పిరిచ్యువల్ సిటీ పేరుతో మొత్తం 138.09 ఎకరాలను తిరిగి టీటీడీకి స్వాధీనం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎన్నడూ స్పిరిచ్యువల్ సిటీ ఊసే ఎత్తలేదు. ఆ ప్రాజెక్టు రూపు రేఖల గురించిన ప్రతిపాదన లేదు. టీటీడీనా.. ప్రయివేటు సంస్థలా.. ఎవరు నిర్మిస్తారో తేల్చలేదు. చంద్రబాబు తలపెట్టిన ప్రాజెక్టును అటకెక్కించేసిన ఆనందంలో ఉండిపోయారు. తిరుపతి అభివృద్ధి జపం చేసిన వైసీపీ నాయకులు కూడా నోరు మెదపలేదు.
తిరుపతి కోల్పోయినట్టేనా?
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయినందున సైన్స్‌సిటీ ఆశలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అయితే అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్‌కి స్థల కేటాయింపు రద్దు చేసే క్రమంలో స్పిరిచ్యువల్ సిటీతో పాటూ సైన్స్‌సిటీ భూములు కూడా రద్దు చేసి టీటీడీకి అప్పగించనున్నట్టు సీఎం ఇటీవల తిరుమలలో ప్రకటించారు. అయితే ప్రత్యామ్నాయంగా తిరుపతిలో మరో వైపున సైన్స్‌సిటీకి భూములు కేటాయిస్తారని అంతా భావించారు. ఈలోగా ఏం జరిగిందోగానీ అమరావతి పేరు తెరమీదకు వచ్చింది. తిరుపతిలో ఏర్పాటు చేయదలచుకున్న ప్రాజెక్టునే అమరావతిలో ఏర్పాటు చేస్తారా? లేక తిరుపతిలోనూ అమరావతిలోనూ కూడా సైన్స్‌సిటీలు ఏర్పాటు చేస్తారా అనే స్పష్టత లేదు. చంద్రబాబు తిరుపతికి ఇచ్చిన హామీని మరచిపోరని, తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మక సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తారనే నమ్మకం విద్యావేత్తలో మాత్రం ఉంది. చూడాలి.. ఏం జరుగుతుందో!
సైన్స్‌సిటీలో ఏముంటాయి..?
- ఇందులో ఏడు భిన్నమైన మ్యూజియంలు ఉంటాయి. ఇవి సాధారణ ప్రజలకూ, విద్యార్థులకూ సైన్సు, సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. అవగాహన పెంచుతాయి.
- బయో మెడికల్, ఫిజికల్ సైన్స్ పరిశోధనలకు ఉద్దేశించిన రీసెర్చ్ ఇన్నొవేషన్ క్లస్టర్ ఉంటుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రాతినిధ్యంతో ఇవి నడుస్తాయి. జూ సైన్సు, సాంకేతిక విజ్ఞాన వ్యాప్తి కోసం ఒక ప్రత్యేక సముదాయం ఏర్పాటు చేస్తారు. జూ ప్లానటోరియం ఏర్పాటు చేస్తారు.