Share News

తమిళనాడుకు గ్రావెల్‌ తరలించొద్దు

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:25 AM

పాలసముద్రం మండలం వనదుర్గాపురం వద్ద ఉన్న క్వారీ నుంచి తమిళనాడుకు గ్రావెల్‌ను తరలించవద్దని స్థానికులతో కలిసి టీడీపీ, సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు.

తమిళనాడుకు గ్రావెల్‌ తరలించొద్దు
గ్రావెల్‌ క్వారీ వద్ద ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు

వనదుర్గాపురం క్వారీలో స్థానికులతో కలిసి టీడీపీ, సీపీఐ నాయకుల ధర్నా

పాలసముద్రం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాలసముద్రం మండలం వనదుర్గాపురం వద్ద ఉన్న క్వారీ నుంచి తమిళనాడుకు గ్రావెల్‌ను తరలించవద్దని స్థానికులతో కలిసి టీడీపీ, సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. 15 రోజులుగా నగరికి చెందిన వైసీపీ నాయకుడు కేజే కుమార్‌ కుమారుడు మురళి వనదుర్గాపురం క్వారీ నుంచి తమిళనాడుకు గ్రావెల్‌ను తరలిస్తున్నారని చెప్పారు. దీనిపై గ్రామస్తులకు, క్వారీ యజమానులకు మధ్య వివాదం జరుగుతూనే ఉందని తెలిపారు. అయినా గ్రావెల్‌ తరలింపు మాత్రం ఆగడం లేదన్నారు. జిల్లా అధికారులు వచ్చేవరకు ధర్నా విరమించేది లేదంటూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే బైఠాయించారు. క్వారీ యజమానులు కూడా పనులు ఆపేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అరుణకుమారి, శ్రీరంగరాజపురం ఎస్‌ఐ సుమన్‌ ఆధ్వర్యంలో పోలీసులు క్వారీ వద్దకొచ్చారు. ధర్నా చేస్తున్నవారితో చర్చించారు. పంచాయతీ తీర్మానంలో మూడేళ్లకు మాత్రమే గ్రావెల్‌ క్వారీకి అనుమతిస్తే.. మైనింగ్‌ శాఖ అధికారులు మాత్రం పంచాయతీ తీర్మానంకంటే రెట్టింపు విస్తీర్ణంలో 30 ఏళ్లకు లీజు అగ్రిమెంట్‌ ఇచ్చారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా క్వారీ యజమానులు జీఎస్టీ చెల్లించకుండా తమిళనాడులో నిర్వహించే రోడ్డు పనులకు గ్రావెల్‌ను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మైనింగ్‌ శాఖ ఆదేశాల్లో ఆరు చక్రాల టిప్పర్ల ద్వారా మాత్రమే గ్రావెల్‌ తరలించాల్సి ఉండగా, 14, 16 చక్రాల టిప్పర్లలో గ్రావెల్‌ తరలిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 25వ తేదీలోగా క్వారీకి అనుమతులు రద్దు చేయకుంటే తాము కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సి.రాజేంద్రన్‌, నాయకులు వాసు నాయుడు, జె.విజయ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ మోహన్‌, హరిరాజు, సీపీఐ నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలొచ్చేవరకు

గ్రావెల్‌ తరలించొద్దని తహసీల్దార్‌ ఆదేశం

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆందోళనకారులకు తహసీల్దార్‌ అరుణకుమారి సర్దిచెప్పారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేవరకు గ్రావెల్‌ను తమిళనాడుకు తరలించొద్దని క్వారీ యజమానులకు ఆమె ఆదేశాలిచ్చారు.

Updated Date - Sep 23 , 2025 | 01:25 AM