Share News

డీకే ఆదికేశవులు కొడుకు, కూతురు అరెస్టు

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:25 AM

చిత్తూరుకు చెందిన పెద్ద కుటుంబంలో రెండు అరెస్టులు జరగడంతో నగరంలో ఈ విషయం గురించి జోరుగా మాట్లాడుకుంటున్నారు.

డీకే ఆదికేశవులు కొడుకు, కూతురు అరెస్టు

చిత్తూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ అనుమానాస్పద మృతి కేసులో టీటీడీ మాజీ అధ్యక్షుడు డీకే ఆదికేశవులు కుమారుడు డీఏ శ్రీనివాస్‌, కూతురు కల్పజ, డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అఽధికారులు సోమవారం బెంగళూరులో అరెస్టు చేసిన అంశం చిత్తూరులో సంచలన చర్చగా మారింది. చిత్తూరుకు చెందిన పెద్ద కుటుంబంలో రెండు అరెస్టులు జరగడంతో నగరంలో ఈ విషయం గురించి జోరుగా మాట్లాడుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ కర్ణాటకతో పాటు ఏపీలోనూ ఎక్కువగా భూవ్యవహారాలు చేసేవారు. ఆదికేశవులుతో సాన్నిహిత్యం ఉండేది. బెంగళూరు వైట్‌ ఫీల్డ్‌లోని నిందితుల గెస్ట్‌హౌ్‌సలో 2019 మే నెలలో ఆయన ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. తన భర్తను కిడ్నాప్‌ చేసి హత్య చేశారని మృతుడి భార్య మంజుల బెంగళూరు హెచ్‌ఎల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులుతో పాటు దామోదర్‌, రామచంద్రయ్య, ప్రతాప్‌ అనే వ్యక్తుల్ని అనుమానితులుగా కేసు నమోదు చేశారు. సోమవారం శ్రీనివాస్‌, కల్పజ అరెస్టయ్యారు. అప్పటి సీఐ మోహన్‌ కేసు నమోదు చేయగా, సాక్ష్యాలను నాశనం చేశారనే ఆరోపణలతో ఆయన్ను కూడా అరెస్టు చేశారు. మోహన్‌ ప్రస్తుతం డీఎస్పీగా ఉన్నారు. ముగ్గురికీ కోర్టు పది రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

Updated Date - Dec 23 , 2025 | 12:26 AM