Share News

తీరం దిశగా కదులుతున్న దిత్వా

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:08 AM

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

తీరం దిశగా కదులుతున్న దిత్వా
తూపిలిపాళెం తీరంలో ఎగిసి పడుతున్న కెరటాలు

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 28(ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్‌ మంచుకొస్తోంది. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో శని, ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది. శ్రీలంకను ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్‌గా ఏర్పడి తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మండల, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలతో పాటు కలెక్టరేట్‌లోను కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తుఫానుతో ఇబ్బంది కలిగినా.. ముంపునకు గురైనా ఎప్పటికపుడు సమాచారాన్ని కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు 0877-2236007లో సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఆర్వో నరసింహులు ఆదేశించారు. దిత్వా తుఫాను నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. తీర.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక పునరావాస కేంద్రాలను సిద్దంచేసి, తాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జలపాతాలు, వాగులు, నదీ ప్రాంతాలు, ప్రమాదకర పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో తుఫాను తీవ్రతను తగ్గించేలా.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాగా, మూడు రోజులపాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆ శాఖ అధికారి రాజేష్‌ సూచించారు.

తీరంలో ఎగిసిపడుతున్న కెరటాలు

వాకాడు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్‌ కారణంగా వాకాడు మండలంలోని తూపిలిపాళెం సముద్రతీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈదురుగాలులు వీస్తూ కెరటాలు బలంగా తీరాన్ని తాకుతున్నాయి. దీంతో మత్స్యకారులు వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేట ఆగడంతో మత్స్యకారులకు జీవనోపాధి దెబ్బతింది. తీరప్రాంతాలలో వీస్తున్న చలిగాలులకు వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 01:08 AM