కార్పొరేషన్‌లో డీజిల్ స్కాం
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:16 AM
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారనడానికి తిరుపతి నగరపాలక సంస్థలో వెలుగుచూసిన డీజిల్ స్కాం ఒకటి.
అవే వాహనాలు. అదే పని. తేడా ఏమంటే.. వైసీపీ ప్రభుత్వం పోయి.. కూటమి అధికారంలోకి వచ్చింది. అంతే.. తిరుపతి కార్పొరేషన్‌లో
డీజిల్ ఖర్చు నెలకు రూ.20 లక్షలు మిగిలింది. అంటే.. ఏడాదికి రూ.రెండు కోట్లకుపైగా డీజిల్‌లో నొక్కేసినట్లు ‘లెక్క’ తేలిందన్నది కార్పొరేషన్ వర్గాల మాట. అప్పటి వైసీపీ పెద్దల అండతో, ఓ డీఈ నేతృత్వంలో ఈ డీజిల్ కుంభకోణం సాగినట్లు విమర్శలున్నాయి.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారనడానికి తిరుపతి నగరపాలక సంస్థలో వెలుగుచూసిన డీజిల్ స్కాం ఒకటి. నగరపాలక సంస్థలో వినియోగిస్తున్న చెత్త ట్రాక్టర్లు 19, ఆటోలు 97, ట్రాలీలు 15, టిప్పర్లు 2, ఎక్స్‌కవేటర్లు (చిన్న, పెద్దవి 4), వాటర్ ట్యాంకర్లు, యూడీఎస్ గల్ఫర్లతో పాటు కార్పొరేషన్ సొంత కార్లకు డీజిల్, పెట్రోలు నింపాల్సి ఉంటుంది. వీటికి సరాసరి రోజుకు వెయ్యి లీటర్ల కన్నా ఎక్కువ కాదు. అయితే గతంలో రోజుకు సరాసరి 1500 లీటర్లు పట్టినట్టు బిల్లులు పెట్టినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ వాహనాల పేరు మీద ఇతరులూ తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేవారనే విమర్శలున్నాయి. కార్పొరేషన్ వాహనాలకు తిరుపతిలో మూడు పెట్రోల్ బంకులనుంచి డీజిల్ నింపుతారు. డీజిల్‌కు సంబంధించి కార్పొరేషన్ జారీ చేసిన టోకెన్లు, బంక్‌లనుంచి వచ్చే బిల్లులు కూడా టోకెన్ల నెంబర్లతో రావాలి. డీజిల్ బిల్ల్లుపై సూపర్ చెక్ ఉండాలి. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులతో రెగ్యులర్‌గా పర్యవేక్షణ ఉండాలి. ఇక, కార్పొరేషన్ వాహనాలన్నీ జీపీఎస్ విధానంతో అనుసంధానమయ్యాయి. వాహనం ప్రారంభమైనప్పటి నుంచి వెళ్లిన ప్రదేశాలు, ఎన్ని కిలోమీటర్ల పరిధిలో వాహనం తిరిగిందన్న విషయం పక్కాగా తెలుస్తుంది. వాటిని బట్టి రోజుకు ఎన్ని లీటర్లు అవసరమో ప్రాథమికంగా ఓ అంచనా వేయచ్చు. ఆ విధంగా వేసే గతంలో ఓ కమిషనర్ డీజిల్ బిల్లులను పక్కనపెట్టినట్టు తెలిసింది. అయితే అఽప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడితో పాటు డీజిల్ బిల్లులు ఇవ్వకపోతే చెత్త వాహనాలు నిలిచిపోతాయనే బ్లాక్ మెయిల్ చేసి మరీ బిల్లులపై సంతకాలు పెట్టించుకునే వారని చెప్పుకుంటున్నారు. ఇలా గతంలో డీజిల్ వినియోగంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఇలా బయటపడింది :
వైసీపీ పెద్దల అండతో గత పాలనలో కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన ఇంజనీరింగ్ విభాగంలోని ఓ డీఈ డీజిల్ స్కాంలో ప్రధాన పాత్రధారి అన్న ఆరోపణలున్నాయి. ఏడు నెలల కిందట అవినీతి ఆరోపణలతో ఈయన బదిలీపై వెళ్లారు. దీంతో డీజిల్ వినియోగంపై మూడంచెల పర్యవేక్షణతో కొత్త అధికారులకు కమిషనర్ మౌర్య బాధ్యతలు అప్పగించారు. గతానికి.. ఇప్పటికి పోల్చి చూస్తే నెలకు దాదాపు రూ.20లక్షల వరకు డీజిల్ బిల్లు తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఓ సందర్భంలో అధికారుల సమీక్షలో కమిషనర్ డీజిల్ బిల్లు గురించి ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. దీంతో కేవలం డీజిల్‌లోనే నెలకు రూ.20లక్షల వరకు అప్పట్లో దోపిడీ సాగిందన్న విషయం వెలుగు చూసింది. కాగా, డీజిల్ నొక్కుడులో ఆ ఇంజినీరింగ్ అధికారికి ఎంత నైపుణ్యం ఉందో.. పంపకాల్లోనూ అంతే టాలెంట్ చూపేవాడని కార్పొరేషన్ వర్గాలు అంటుంటాయి.
విచారించకుండా వదిలేస్తారా?
డీజిల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని కార్పొరేషన్ గుర్తించింది. దీనిపై బాహాటంగానే చర్చ జరుగుతోంది. ఎస్‌ఈ, ఎంఈ సంతకాలు లేకుండా కూడా డీజిల్ బిల్లులు జారీ అయ్యాయని చెబుతున్నారు. ఏడాదికి దాదాపు రూ.రెండు కోట్లు లూఠీ చేస్తే మౌనం దాల్చడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. డీజిల్ వినియోగంలో అవకతవకల ఆరోపణలపై ఫైళ్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. లాగ్‌బుక్‌లు, ఓచర్లు తనిఖీ చేస్తే దీనివెనుక ఎవరున్నారో అసలు బండారం బయటపడుతుంది. కూటమి నాయకులైనా దీనిపై విచారణ జరిపించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అక్రమాలకు అవకాశం లేకుండా
గతంలో నగరంలోని ప్రధాన రోడ్లను రాత్రిపూట స్వీపింగ్ వాహనాలతో శుభ్రం చేసేవారు కాదు. ఇప్పుడు చేస్తున్నారు. అదేవిధంగా కొత్త వాహనాలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా నెలకు సుమారు రూ.45 లక్షల నుంచి రూ50లక్షలు డీజిల్ బిల్లు వస్తోంది. ఇలా మరిన్ని వాహనాలతో డీజిల్ వినియోగం పెరిగినా.. వైసీపీ హయాంతో పోలిస్తే ఇప్పటికీ రూ.పది లక్షల వరకు మిగులే ఉంటోంది. ప్రస్తుతం ఏ వాహనంలో ఎంత డీజిల్ పోస్తున్నారు? అది ఎన్ని కిలోమీటర్ల దూరం తిరిగింది అన్న సమాచారం పక్కాగా ఉండటంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయినట్టుగా తెలుస్తోంది.
==========================