జి.గొల్లపల్లెలో విజృంభించిన అతిసార
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:13 AM
తవణంపల్లె మండలంలోని జి.గొల్లపల్లె గ్రామంలో అతిసార వ్యాధి విజృంభించడంతో సుమారు 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో పెట్టిన ప్రసాదాలు తినడం వల్ల గురువారం సాయంత్రం నుంచే పలువురికి విరేచనాలు అయినట్లు తెలుస్తోంది.
40 మందికి అస్వస్థత
తవణంపల్లె, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తవణంపల్లె మండలంలోని జి.గొల్లపల్లె గ్రామంలో అతిసార వ్యాధి విజృంభించడంతో సుమారు 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో పెట్టిన ప్రసాదాలు తినడం వల్ల గురువారం సాయంత్రం నుంచే పలువురికి విరేచనాలు అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయానికి గ్రామంలో సుమారు 40 మందికిపైగా విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న మండల వైద్యాధికారులు ప్రియాంక, మోహనవేలు ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్సలు అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వంశీ, సరసమ్మ, జయమ్మలను అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. సక్కుబాయి, శ్యామల, నాగరాజు, జీవరత్నం, పుష్పలను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న చిత్తూరు క్షయవ్యాధి నివారణాధికారి, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ వెంటనే జి.గొల్లపల్లెకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో మంచినీటి పథకాల క్లోరినేషన్‌తోపాటు కాల్వలను శుభ్రం చేయించారు. వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.