సరస్వతి స్వరూపుడిగా భక్తులకు కటాక్షం
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:54 AM
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి మలయప్పస్వామి వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
రెండున్నర గంటల పాటు సాగిన వాహన సేవ
తిరుమల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి మలయప్పస్వామి వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎండతీవ్రత అఽధికంగా ఉండటంతో ఉదయం జరిగిన చిన్నశేషవాహనంలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గ్యాలరీలన్నీ ఖాళీగా కనిపించాయి. సాయంత్రానికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్న క్రమంలో రాత్రి హంస వాహన సమయంలో దక్షణ మాడవీధి మినహా మిగిలిన గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో వాహనాన్ని నెమ్మదిగా కదిలిస్తూ గ్యాలరీల్లోని భక్తులకు సంతృప్తికరమైన దర్శనాన్ని కల్పించారు. దీనివల్ల అరగంట ఆలస్యంగా.. రాత్రి 7 నుంచి 9.30 గంటల వరకు వాహన సేవ సాగింది. వీఐపీలు తిరుగు ప్రయాణమైన క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు. రాత్రి వాహన సేవ ముందు వీఐపీల హడావుడి ఎక్కువ కాగా.. దీనిని తగ్గించాలంటూ భద్రతాధికారులను ఈవో సింఘాల్ ఆదేశించారు. ఈ వాహన సేవలో సుప్రీం కోర్టు మాజీ ప్రఽధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహణ్యం, నటి వాసూకీ, చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఉదయం: చిన్నశేష వాహనంపై గరువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్ప కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవలు వైభవంగా జరిగాయి.
బ్రహ్మోత్సవాలలో నేడు
ఉదయం: 8-10 మధ్య సింహవాహనం
రాత్రి: 7-9 మధ్య ముత్యపుపందిరి వాహనం