ముక్కంటి ఆలయం వద్ద భక్తుడికి గుండెపోటు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:53 AM
ముక్కంటి దర్శనార్థం విచ్చేసిన నరసింహారావు (60) గుండెపోటుతో మృతి చెందారు.
శ్రీకాళహస్తి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ముక్కంటి దర్శనార్థం విచ్చేసిన నరసింహారావు (60) గుండెపోటుతో మృతి చెందారు. కడపకు చెందిన ఈయన కుటుంబ సమేతంగా మంగళవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరాలయం చేరుకున్నారు. అద్దె గది కోసం ఆలయ నాలుగో ప్రవేశ మార్గం వద్ద ఉన్న సీఆర్వో కేంద్రానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. సీఆర్వో కార్యాలయం వెలుపల నిలబడి ఉన్న నరసింహరావు ఉన్నట్టుండి కుప్పకూలారు. అంబులెన్సు నిలిపి ఉంచే పరిపాలనా భవనానికి సమీపంలో భక్తుడు గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో ఒక్క డ్రైవరూ అందుబాటులో లేరు. మరోవైపు బాధితుడి కుటుంబీకులు ఆర్తనాదాలు పెట్టారు. ఆ సమయంలో ముక్కంటి ఆలయ నైవేద్యం తయారీ పోటులో పనిచేసే అర్చకుడు రాఖీశర్మ అటుగా వెళుతూ స్పందించారు. నరసింహారావును ఆలయ అంబులెన్సులో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహారావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంబులెన్సు డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంపై మృతుడి బంధువులతో పాటు ఈఘటన చూసిన భక్తులంతా ఆవేదన చెందారు.
ఇదేమి తీరు?
ముక్కంటి ఆలయంలో మొత్తం ఏడుగురు డ్రైవర్లను నియమించారు. అంబులెన్సుతోపాటు అఽధికారుల వాహనాలకు వీరు విధులు నిర్వహించాలి. ఆలయం తరపున ఉన్న అంబులెన్సు కోసం షిఫ్టుల ప్రాతిపదికన నిరంతరం డ్రైవర్లు అందుబాటులో ఉండాలి. వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రివేళలో ఆలయ ప్రాంగణంలో ఆరుబయట భక్తులు పెద్దసంఖ్యలో నిద్రిస్తుంటారు. పలుమార్లు రాత్రి వేళల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. నాల్గో గేటు వద్ద నిద్రిస్తున్న భక్తులపై స్టోర్ కోసం నిత్యావసరసరుకులు తీసుకువచ్చిన మినీలారీ మూడేళ్లక్రితం దూసుకెళ్లింది. రాత్రివేళ్లలో స్వల్ప ఘటనలు జరుగుతుంటాయి. ఇంతటి కీలకమైన ఆలయ స్థావరంలో అంబులెన్సు డ్రైవర్ విధుల్లో అప్రమత్తంగా లేకపోవడం విమర్శలకు తావిచ్చింది.