ఏళ్లు గడుస్తున్నా నత్తనడకన తెలుగుగంగ కాలువ పనులు
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:15 AM
తెలుగుగంగ కాలువ పనులకు ఆది నుంచి అడ్డంకులు శాపంగా పరిణమిస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పునాది పడినా నేటికీ అడుగు ముందుకు పడటం లేదు. ఫలితంగా ఈ కాలువ నీటితో సాగుచేయాలనే రైతుల కోరిక నెరవేరడంలేదు.
దొరవారిసత్రం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ కాలువ పనులకు ఆది నుంచి అడ్డంకులు శాపంగా పరిణమిస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పునాది పడినా నేటికీ అడుగు ముందుకు పడటం లేదు. ఫలితంగా ఈ కాలువ నీటితో సాగుచేయాలనే రైతుల కోరిక నెరవేరడంలేదు. 2002లో దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల్లో 38వేల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో నాటి టీడీపీ ప్రభుత్వం 14(ఆర్) తెలుగుగంగ కాలువ పనులకు శ్రీకారం చుట్టింది. కండలేరు జలాశయం నుంచి చెన్నై వెళ్లే సత్యసాయి తెలుగుగంగ కాలువకు ఉప కాలువగా దీనిని రూపొందించారు. రెండు మండలాల్లో 25 గ్రామాల రైతులకు ఉప కాలువల ద్వారా సాగు నీరు అందించాలనేది ఉద్దేశం.
23 సంవత్సరాలుగా వీడని గ్రహణం
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2002లో కాలువ పనులు ప్రారంభించింది. అయితే రెండేళ్లకే ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో పనులకు గ్రహణం పట్టింది. పనులు ఆగిపోయాయి. కొన్నిచోట్ల అటవీశాఖ అనుమతులు లేక, ఎగువ ప్రాంత రైతుల అభ్యంతరాలు తదితర కారణాలతో పనుల్లో పురోగతి కనిపించలేదు. తమ భూముల్లో కాలువపోతుందని మరోపక్క నెలబల్లి గ్రామ రైతులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. దీంతో పనులు మందుకు సాగలేదు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఈ విషయంలో కనీస శ్రద్ధ చూపలేదు.
పునఃప్రారంభమైనా మళ్లీ బ్రేక్
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాలువకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని నాటి సీఎం చంద్రబాబు ఆదేశించారు. పనుల కోసం రూ.22.5 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ చొరవ తీసుకుని అటవీశాఖ అనుమతులు రప్పించడంలో సఫలీకృతమయ్యారు. నెలబల్లి రైతులనూ ఒప్పించారు. వారి పరిహారంపైనా చర్యలు తీసుకోవడంతో 2016 ఆగస్టులో 14(ఆర్) కాలువ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని రోజులకే వర్షాలు కురవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. తిరిగి ప్రారంభించడంలో నిర్లక్ష్యం చూపుతూ వచ్చారు.
గాలికొదిలేసిన వైసీపీ
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాలువ పనులపై శీతకన్ను వేసింది. దీనికితోడు కాంట్రాక్టర్లలోనూ చలనం కనిపించలేదు. అనుమతులు వచ్చిన అటవీ ప్రాంతాల్లోనూ తవ్వకాలను గాలికొదిలేశారు. ప్రతిపాదిత వంతెనల నిర్మాణాల ఊసే పట్టించుకోలేదు. చివరి తడికోసం రైతులు అల్లాడిపోయినా వైసీపీ ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కిత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం కావడంతో ఈ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే నేటికీ పనుల్లో కదలిక రాలేదు. నాడు ఈ పనుల విషయంలో చొరవ చూపిన మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. 38వేల ఎకరాలకు సాగునీరందించే కాలువ పనులు పూర్తి చేస్తారని వీరంతా ఆశతో నిరీక్షిస్తున్నారు.
ప్రభుత్వం చొరవ చూపాలి
14(ఆర్) కాలువ పనులను పూర్తి చేస్తే నెలబల్లికి దిగువ ప్రాంత గ్రామాలైన పడమట్టికండ్రిగ, ఆనేపూడి, వడ్డికండ్రిగ, పూలతోట, కొత్తపల్లి గ్రామాలకు నీరు వస్తుంది. సూళ్లూరుపేట మండలంలో కోటపోలూరు, తూర్పుపల్లెలకు గంగ నీరు చేరుతుంది. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. కాలువ సమస్యను పరిష్కరించేందుకు పాలకులు చొరవ చూపాలి.
- మురళీరెడ్డి, సర్పంచ్, ఆనేపూడి
చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాం
ఏళ్ల తరబడి కాలువ నీటి కోసం ఎదురు చూస్తున్నాం. పలు పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆగిన పనులను పూర్తి చేస్తే నేలపట్టు, మైలాంగం గ్రామాల్లో పంటలు ఎండిపోకుండా రక్షించుకోవచ్చు. ఈ ఏడాది మేమే కొన్నిచోట్ల చిన్నపాటి కాలువలుగా తవ్వి నీరు తెచ్చుకున్నాం. పక్షుల విడిదికి కూడా 14(ఆర్) గంగ కాలువ నీరు అవసరం.
- దువ్వూరు గోపాలరెడ్డి, ఉప ఎంపీపీ, మైలాంగం