Share News

కుంకీలొచ్చినా... కొనసాగుతున్న గజదాడులు

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:39 AM

చిత్తూరు జిల్లా రైతాంగానికి కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు అలంకారప్రాయమేనా అన్న అభిప్రాయాలు బాధిత రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

కుంకీలొచ్చినా... కొనసాగుతున్న గజదాడులు
ఎలిఫెంట్‌ క్యాంపులో కుంకీలు

పలమనేరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా రైతాంగానికి కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు అలంకారప్రాయమేనా అన్న అభిప్రాయాలు బాధిత రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకీ(శిక్షణ పొందిన) ఏనుగులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది. కర్ణాటకలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని ఇక్కడ చేపట్టేందుకు అటవీశాఖ మంత్రి అయిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చొరవ తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో అటవీశాఖ అధికారులతో కలిసి చర్చలు జరిపారు.కుంకీ ఏనుగులను పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంతో వాటి నిర్వహణ కోసం ఇక్కడి అటవీశాఖ అధికారులను, సిబ్బందిని కర్ణాటకకు పంపి శిక్షణ కూడా ఇప్పించారు.పలమనేరు మండలంలోని మొసలిమడుగు గ్రామ సమీపంలో కుంకీల నివాసానికి ఏర్పాట్లు చేశారు.ఏడాది కాంలో ఎలిఫెంట్‌క్యాంపుకు సంబంధించి అటవీశాఖ లక్షలాది రూపాయలను వెచ్చించింది.ఎలిఫెంట్‌ క్యాంపు చుట్టూ అటవీప్రాంతంనుంచి ఏనుగులు లోనికి రాకుండా కందకాలు తవ్వించారు.క్యాంపు చుట్టూ హ్యాంగింగ్‌ సోలార్‌ కంచె ఏర్పాటు చేశారు.కుంకీలకు వైద్యసేవలు అందించేందుకు ఒక పశువైద్య అధికారిని నియమించారు, కుంకీలకు ఆహారం తయారు చేసేందుకు ఒక వంటగది, వంట మనుషులను ఏర్పాటు చేశారు. కుంకీలను సంరక్షించే మావటీలకు నివాస సౌకర్యం కల్పించారు. కుంకీలకోసం ప్రత్యేక షెడ్డు నిర్మించడంతో పాటు వాటికి ఆహారం అందించడం కోసం దాదాపు 70 లక్షలతో ఏడాది కాలానికి టెండరు పిలిచారు. కుంకీక్యాంపు ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా కూడా తీర్చిదిద్దుతున్నారు.ఇక్కడి అటవీశాఖ అధికారులు ఏడాది కాలంగా తమ సమయాన్ని ఈ క్యాంపు పనులకే వెచ్చిస్తున్నారు. వీరే కాక ఏనుగులు పంటలపైకి వచ్చినపుడు వాటిని అటవీప్రాంతంలోకి మళ్లించేందుకు నియమించబడిన ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ సైతం కుంకీల క్యాంపు వద్దే చాలామంది వుంటూ వచ్చారు. క్యాంపు నుంచి కుంకీలను అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు కూడా సిద్ధం చేసి పెట్టారు. ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.అంతేకాక క్యాంపుకు పడమటి వైపు అంతర్రాష్ట్ర రహదారికి అభిముఖంగా ప్రధాన ద్వారం కూడా ఏర్పాటు చేశారు.ఎలిఫెంట్‌ క్యాంపుకు ఈ ఏడాది మే నెలలో రెండు, జూన్‌ నెలలో రెండు కుంకీలను కర్ణాటక నుంచి తీసుకొచ్చారు.కర్ణాటక దుబేరా ఎలిఫెంట్‌ బేస్‌ క్యాంపు నుంచి వచ్చిన కుంకీలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి నెల రోజులు పట్టింది. 17 మంది మావటీలు కుంకీలను వారి స్వాధీనంలోకి తీసుకోడానికి మరో 40 రోజులు పట్టింది. మొత్తంగా 70 రోజుల శిక్షణ అనంతరం ఆపరేషన్‌ కుంకీని తొలిసారిగా ఆగస్టు ఒకటవ తేదీ సాయంత్రం నిర్వహించారు.టేకుమంద ప్రాంతంలో 8ఏనుగులు తిరుగుతున్నాయన్న సమాచారంతో కుంకీలు కృష్ణ, జయంత్‌, వినాయక్‌లను తీసుకెళ్లారు. 2వ తేదీ ఉదయానికి ఏనుగులను అటవీ సరిహద్దు ప్రాంతంలోకి పంపడంతో ఆపరేషన్‌ పూర్తయింది. దీంతో ఈ ప్రాంత రైతులు గజదాడులనుంచి తమ పంటలకు ఇబ్బందులు తప్పుతాయని ఆశపడ్డారు.అయితే ఇప్పటివరకు రెండు మూడు పర్యాయాలు మాత్రమే క్యాంపు నుంచి కుంకీలను చుట్టుపక్కల ప్రాంతాలకు అటవీశాఖ అధికారులు తీసుకురాగలిగారు.

రోజూ దాడులు జరుగుతున్నా....

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. ఆరునెలల నుంచి అయితే రోజూ ఎక్కడో ఒకచోట చేతికొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేస్తూనే వున్నాయి. ఈ ఒక్క మండలంలోనే 224 హెక్టార్ల వరి,110 హెక్టార్ల టమోటా,200 హెక్టార్ల మామిడి పంటలతో పాటు 600 కొబ్బరి చెట్లు ఏనుగుల దాడిలో దెబ్బతిన్నాయి.పలు గ్రామాలకు చెందిన రైతులు పంటలు నష్టపోయి వ్యవసాయమంటేనే విరక్తి పుట్టే దశకు చేరుకున్నారు. రొంపిచెర్ల, సోమల, బంగారుపాళ్యం, గంగవరం, పలమనేరు,చంద్రగిరి మండలాల్లో కూడా ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. అయినా కుంకీ ఏనుగులను రంగంలోకి దించి గజదాడుల కట్టడికి అధికారులు చర్యలు తీసుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ కుంకీల కోసం ఇప్పటివరకు పెట్టిన ఖర్చు సత్ఫలితాలిస్తున్న హ్యాంగింగ్‌ సోలార్‌ విద్యుత్‌ కంచెపై పెట్టివుంటే రైతులకు ఎంతోకొంత ప్రయోజనం కలిగేదంటుంటున్నారు.ప్రభుత్వం సోలార్‌ కంచె ఏర్పాటు చేయకపోయినా 90 శాతం సబ్బిడీ ఇస్తే తామే ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమంటున్నారు.

ఎలిఫెంట్‌ క్యాంపు చుట్టూ ....

మొసలిమడుగు సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ క్యాంపులో ఉన్న కుంకీల వాసనను పసిగట్టిన సమీప అటవీ ప్రాంతంలో వున్న ఏనుగులు ఇప్పటికే పలుమార్లు క్యాంపులోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాయి.ఒంటరి ఏనుగు క్యాంపు ప్రధాన ద్వారం వద్దకు వచ్చి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించి చివరకు ప్రధాన ద్వారం ఒకవైపు కట్టిన గోడను తోసివేసింది. ఈ సంఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కూడా రికార్డయింది.కుంకీ ఏనుగుల క్యాంపు ఏర్పాటు చేసినప్పటి నుంచి పరిసరాల్లో ఏనుగుల సంచారం పెరిగిందని రైతులు చెబుతున్నారు.తమ పంటలను తరచూ నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు.

ఆపరేషన్‌ కుంకీకి పరిస్థితులు అనుకూలించలేదు

పులిచెర్ల మండలం అటవీ పరివాహక ప్రాంతాల్లో తిరుగాడుతున్న ఏనుగుల కట్టడికి అవసరమైన ఆపరేషన్‌ కుంకీకి తాము సిద్ధమే కానీ అక్కడి పరిస్థితులు అనుకూలించడం లేదని డీఎ్‌ఫవో సుబ్బరాజు చెప్పారు.శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ పలమనేరు, కుప్పం, పుంగనూరు అటవీ సరిహద్దు ప్రాంతాలతో పాటు పులిచెర్ల, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాల్లో ఏనుగుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.అటవీ సిబ్బంది రౌండ్‌ ది క్లాక్‌ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే కల్లూరు ప్రాంతంలోని ఏనుగుల గుంపు బలం పుంజుకున్నాయని, ఈ పరిస్థితిలో కుంకీలను అక్కడ ప్రయోగించలేమన్నారు. ఒకటో, రెండో, మహా అయితే ఐదు ఏనుగుల వరకూ తిరుగాడుతుంటే కుంకీల సాయంతో వాటిని అడవుల్లోకి పంపవచ్చన్నారు. ప్రస్తుతం కల్లూరు ప్రాంతంలో 17 ఏనుగులు గుంపుగా తిరుగుతుండడంతో కుంకీలను ప్రయోగించలేకపోతున్నామని చెప్పారు. ఒకవేళ ప్రయోగిస్తే కుంకీలతో పాటు మావటీల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశముందన్నారు. గుంపులోని ఏ రెండు ఏనుగులైనా కలిసి కుంకీపై దాడి చేసే ప్రమాదముందన్నారు. ఇది చూసి మిగిలినవి కూడా వాటితో జతకట్టి, కుంకీ ఏనుగులతో పాటు మావటీలను కూడా చంపే అవకాశాలున్నాయన్నారు.లేదా మావటీల కమాండ్‌ను విస్మరించి కుంకీలు అటవీ ప్రాంతంలోని ఏనుగులతో జతకట్టి వెళ్లిపోయే అవకాశాలు కూడా వున్నాయన్నారు.

వారంలో అందుబాటులోకి గజ - ప్రజ యాప్‌

గజదాడుల ద్వారా జరిగే నష్టాన్ని రైతులకు నేరుగా తెలియజేసి, త్వరితగతిన వారు నష్టపరిహారం పొందేందుకు అటవీ శాఖ తయారు చేసిన గజ-ప్రజ యాప్‌ వారం రోజుల్లో అందుబాటులోకి రానుందని డీఎ్‌ఫవో సుబ్బరాజు చెప్పారు.గూగుల్‌ అనుమతి వచ్చాక ప్లే స్టోర్‌ ద్వారా రైతులకు అందుబాటులో వస్తుందన్నారు. యాప్‌ వినియోగంపై ఇప్పటికే అటవీ, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు అవగాహన కల్పించామని వివరించారు.

Updated Date - Nov 08 , 2025 | 12:39 AM