తీరని యూరియా కష్టాలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:01 AM
జిల్లా రైతులకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు వరి సాగుపై దృష్టి సారించారు.ఇందుకు అవసరమైన యూరియా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైన మేరకు యూరియా నిల్వలు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు విక్రయ కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. జిల్లాకు 26,793 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 13,800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద 2 వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా, మరో వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో యూరియా కొరత తీరాలంటే మరో 10 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంది.కాగా చిత్తూరులోని మార్క్‌ఫెడ్ వద్ద 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉండగా, గాంధీ రోడ్డులోని సీడీసీఎంఎ్‌సకు 20 మెట్రిక్ టన్నులు అంటే 450 బస్తాలు ఇచ్చారు.వీటికోసం పెద్దసంఖ్యలో రైతులు సీడీసీఎంఎస్ వద్ద శుక్రవారం ఉదయం నుంచే పడిగాపులు కాశారు. ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు నిరాశ వ్యక్తం చేశారు.