Share News

ఢిల్లీ టూ తిరుపతి

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:26 AM

ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు పోలీసుల ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఢిల్లీ గోడౌన్లలో దాచి ఉంచిన దాదాపు రూ.8 కోట్ల విలువైన 10 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, తిరుపతికి తీసుకొచ్చారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పట్టుకున్నారు.

ఢిల్లీ టూ తిరుపతి
ఢిల్లీ నుంచి తిరుపతికి తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు

రూ.8 కోట్ల విలువైన 10 టన్నుల ఎర్రచందనం స్వాధీనం

ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు

ప్రధాన నిందితుడి కోసం గాలింపు

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు పోలీసుల ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఢిల్లీ గోడౌన్లలో దాచి ఉంచిన దాదాపు రూ.8 కోట్ల విలువైన 10 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, తిరుపతికి తీసుకొచ్చారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్సు చీఫ్‌ సుబ్బరాయుడు వివరాల మేరకు.. హైదరాబాదు హకీంపేటలో కాపురముంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్‌ ఇర్ఫాన్‌, మహారాష్ట్ర కరాడ్‌ తహసీల్‌కు చెందిన అమిత్‌ సంపత్‌ పవార్‌ ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్‌ ఇటీవల కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు ప్రాంతంలో తమిళనాడుకు చెందిన రాజ్‌కుమార్‌ను పట్టుకుని విచారించారు. శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొల్లగొట్టి ఢిల్లీలోని గోడౌన్లలో దాదాపు 10 టన్నులు దాచి ఉంచినట్లు బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ ఖాదర్‌ బాషా, సిబ్బందిని ఢిల్లీకి పంపారు. వీరు ఢిల్లీ పోలీసులు, ఫారెస్టు అధికారుల సహకారంతో సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీ తుష్లుకాబాద్‌ ప్రాంతంలో రెండు రోజుల పాటు తనిఖీలు చేశారు. ఈనెల 6న ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా తుష్లుకాబాద్‌, కుయన్‌ మొహల్లా ప్రాంతంలోని గోడౌన్‌ నెంబరు 366పై దాడి చేసి 10 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అమిత్‌ సంపత్‌ పవార్‌ను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను ఢిల్లీ కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై తిరుపతికి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాస్‌ చెప్పారు.

సిబ్బందికి అభినందనలు

ఢిల్లీ గోడౌన్‌లో అక్రమంగా దాచి ఉంచిన 10 టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో కృషి చేసిన టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, షరీఫ్‌, సీఐలు షేక్‌ ఖాదర్‌బాషా, ఎస్‌ఐ రఫీ, ఆర్‌ఎ్‌సఐ మురళీధరరెడ్డి, కానిస్టేబుళ్లు వంశీకృష్ణ, షేక్‌బిలాల్‌, చిన్ని కృష్ణయ్యలను టాస్క్‌ఫోర్సు చీఫ్‌ సుబ్బరాయుడు, ఫారెస్టు అధికారి సెల్వం అభినందించారు.

Updated Date - Oct 12 , 2025 | 01:26 AM