డీసీసీబీ భోక్తలపై తదుపరి చర్యలకు బ్రేక్
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:18 AM
ఐదేళ్ళ వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) జరిగిన అవినీతి, ఆర్థిక అక్రమాల్లో భోక్తలుగా గుర్తించిన వారిపై తీసుకోనున్న తదుపరి చర్యలపై ఎనిమిది వారాల పాటు మధ్యంతర స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది
ఎనిమిది వారాల పాటు మధ్యంతర స్టే మంజూరు చేసిన హైకోర్టు
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ళ వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) జరిగిన అవినీతి, ఆర్థిక అక్రమాల్లో భోక్తలుగా గుర్తించిన వారిపై తీసుకోనున్న తదుపరి చర్యలపై ఎనిమిది వారాల పాటు మధ్యంతర స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.డీసీసీబీ పాలకవర్గం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందంటూ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చేసిన ఆరోపణలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన విచారణ లో 120 మందిని బాధ్యులుగా గుర్తించి రూ.21.12 కోట్లు దుర్వినియోగం జరిగిందని తేల్చారు. అప్పటి బోర్డు డైరక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం ఈ వ్యవహారంపై గత వారం హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.కలెక్టర్, సహకారశాఖ కమిషనర్, డీఆర్వో, డీసీవో, డీసీసీబీ సీఈవోలను ప్రతివాదులుగా చేర్చారు.బ్యాంకు వ్యవహారాలపై పక్షపాత, నకిలీ విచారణ నిర్వహించడంతో పాటు ఏకపక్షంగా ఇచ్చిన సెక్షన్-51 విచారణ నివేదికను రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ అధికారులకు అందిన సమాచారం ఆధారంగా విచారణ నిర్వహించామని, పిటీషనర్‌పై ఎటువంటి చర్యను ప్రతిపాదించలేదని తెలిపారు. దీనిపై హైకోర్టు సైతం కేసు వాస్తవాల పరిస్థితుల దృష్ట్యా 51 సెక్షన్ విచారణ నివేదికపై తీసుకొనే తదుపరి చర్యలపై 8 వారాలపాటు మధ్యంతర స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా హైకోర్టు ఆర్డర్‌పై కౌంటర్ పిటీషన్ వేసేందుకు పలువురు ప్రతివాదులు సిద్ధమౌతున్నట్లు సమాచారం. కాగా తొలగించబడినవారిలో ముగ్గురు ఉద్యోగులు సైతం హైకోర్టు గడప ఎక్కినట్లు తెలిసింది. ఇదిలావుండగా, మరోవైపు వచ్చేనెల 6వ తేది నుంచి చిత్తూరు డీఎల్సీవో కార్యాలయంలో జరగాల్సిన సహకార చట్టం 60-1 సెక్షన్ విచారణ కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం.