కురబ జాతరకు వెల్లువెత్తిన జనం
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:53 AM
భక్తుల తలలపై పగులుతున్న కొబ్బరి కాయలు. భక్తిపారవశ్యంతో ఊగిపోయే జనాలు.హరహర మహదేవ్.. దేవరా.. అంటూ మిన్నంటే భక్తిపూర్వక నినాదాలు. అక్షరాలా మినీ కుంభమేళాను తలపించేలా ఇసుక వేస్తే రాలనంత జనం.ఇది తొమ్మిదేళ్ల తరువాత సిద్ధేశ్వరస్వామిని కొలుస్తూ కురబ కులస్తులు జరుపుకున్న పెద్ద దేవర సంబరం.
భక్తుల తలలపై పగులుతున్న కొబ్బరి కాయలు. భక్తిపారవశ్యంతో ఊగిపోయే జనాలు.హరహర మహదేవ్.. దేవరా.. అంటూ మిన్నంటే భక్తిపూర్వక నినాదాలు. అక్షరాలా మినీ కుంభమేళాను తలపించేలా ఇసుక వేస్తే రాలనంత జనం.ఇది తొమ్మిదేళ్ల తరువాత సిద్ధేశ్వరస్వామిని కొలుస్తూ కురబ కులస్తులు జరుపుకున్న పెద్ద దేవర సంబరం.
కుప్పం/శాంతిపురం, మార్చి 14 (ఆంరఽధజ్యోతి): శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ కదిరిముత్తనపల్లెలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన దైవం మొండికాళు సిద్ధేశ్వరస్వామే అయినా, ఆయనతోపాటు భగేశ్వరస్వామి, బత్తేశ్వరస్వామి, రేవణ సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి కూడా పూజలందుకుంటున్నారు. కురబ కులస్తుల గోత్ర దైవాలైన వీరికి 9 ఏళ్లకు ఒకసారి వచ్చే పెద్ద దేవర ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పంచ శైవ మూర్తుల మూల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా ఆలయం వెలుపలికి తీసుకు వచ్చారు.అప్పటికే మోకాళ్లపై వరుసల్లో కూర్చున్న భక్తులు తలలపై కొబ్బరి కాయలు కొట్టుకుని మొక్కులు తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ వేడుకను చూడడానికి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల తలలపై కొబ్బరికాయలు ఫట్ ఫట్ మంటూ పగిలాయి.ఒక్కో కొబ్బరికాయా పగులుతుంటే భక్తులు చేస్తున్న స్వామివారి నామ స్మరణలతో పరిసరాలు మార్మోగాయి. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలనుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో కురబ కులస్తులు కుటుంబాలతో ఈ వేడుకకు తరలివచ్చారు. ఇతర కులస్తులు కూడా వీరికి తోడయ్యారు. దైవం కురబ గోత్ర దైవమే అయినా, పెద్ద దేవర వారి సంబరమే అయినా, కుల రహితంగా ఈ జాతరలో లక్షలాది మంది భక్తజనం పాల్గొన్నారు. పెద్ద దేవర జరిగిన కదిరముత్తనపల్లె ఒక్కటే కాదు, చుట్టూ అయిదు కిలోమీటర్ల మేర పరిసరాలు జన సందోహంతో కిటకిటలాడాయి.
సిద్ధేశ్వరస్వామిస్వామి సేవలో సీఎం సతీమణి
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పెద్ద దేవరకోసమే హైదరాబాదునుంచి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కదిరిముత్తనపల్లెకు చేరుకున్న ఆమె ఆలయం వద్దకు వెళ్లి, స్వామివారికి సారె సమర్పించారు.దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంనుంచి బయటకు వచ్చి, భక్తులకు అభివాదం చేశారు.ఓపెన్ టాప్‌పై ఎక్కి మాట్లాడారు. మూడు రాష్ట్రాలనుంచి లక్షలాదిగా కురబ కులస్తులు తరలివచ్చి సిద్ధేశ్వరస్వామిని కొలుచుకోవడం, అది కూడా తొమ్మిదేళ్లకోసారి పెద్ద దేవర రావడం అబ్బురంగా వుందన్నారు. ఈ జాతరలో భక్తుల సౌకర్యాలకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.80 లక్షలు ఇచ్చారని చెప్పారు.సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో భువనేశ్వరి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం తదితరులున్నారు.