భక్తజనసంద్రం.. రాజనాలబండ
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:13 AM
సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ తిరునాళ్లలో భాగంగా ఉట్లోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.
చౌడేపల్లె, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ తిరునాళ్లలో భాగంగా ఉట్లోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. కొండపై స్వయంభువుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి ఉదయాన్నే అర్చకులు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కొలింపల్లెలోని బోయకొండ గంగమ్మ ఉత్సవమూర్తి, ఊటూరు, దాసరయ్యగారిపల్లె, పెద్దూరు దేవరెద్దులను ఎగువ, దిగువ గాజులవారిపల్లె, మర్రిమాకులపల్లె, పెద్దూరు, కొత్త గూబలవారిపల్లె, వెంగళపల్లె, కొలింపల్లె, ఊటూరు, కొండామాని గ్రామాల పురవీధుల్లో చెక్కభజనలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ రాజనాలబండకు తీసుకొచ్చారు. ఆలయం ముందున్న నాలుగు కాళ్ల మండపం వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆలయం ముందు 50 అడుగుల ఎత్తయిన పాకుమానుకు ఆముదం, ఆవాలు, కలబందగుజ్జు తదితర లేపనాలు పూసి చివరిభాగంలో స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేశారు. చౌడేపల్లె మండలంలోని మల్లెలవారిపల్లె, మర్రిమాకులపల్లె, గాజులవారిపల్లె, పెద్దూరు, వెంగళపల్లె, కొలింపల్లెకు చెందిన పాపుగాని వంశానికి చెందిన వారసులు పాకుమాను పాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దూరుకు చెందిన యువకులు పాకుమానును పాకి స్వామివారి ప్రసాదం దక్కించుకున్నారు. చిప్పలివారిపల్లె, మల్లెలవారిపల్లె, మోట్లపల్లె గ్రామానికి చెందిన యువకులు ఉట్టి కొట్టి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో రాజనాలబండ భక్తజనసంద్రమైంది. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు వేచి ఉంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ఏబీఎన్ చౌదరి, సూపరింటెండెంట్ నాగేంద్రప్రసాద్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు భానుప్రకాష్, ధనంజయరావు, టీటీడీ సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.