అవినీతి సీఐలకు అందలం
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:32 AM
చిత్తూరు నగరంలోని ఓ కీలక స్టేషన్ సీఐ మీద తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి
చిత్తూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఎస్‌ఐలు, సీఐల మీద తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చి విచారణలో అవి నిరూపణ అయితే, ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.కానీ చిత్తూరు పోలీసు శాఖలో పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. చిత్తూరు నగరంలోని ఓ కీలక స్టేషన్ సీఐ మీద తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. గుట్కా వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నారనేది ఒకటి. గర్భిణులకు లింగ నిర్ధారణ చేస్తున్నవారిని స్వయంగా కలెక్టర్ సుమిత్‌కుమార్ రైడ్ చేసి పట్టుకున్న నిందితుల నుంచి ఏకంగా రూ.15 లక్షలు తీసుకున్నారనేది మరోటి. ఈ రెండింటిలో గుట్కా వ్యాపారి నుంచి పెద్దమొత్తంలో లంచం వసూలు కేసును పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ విచారిస్తున్నారు. వసూలు చేసింది వాస్తవమే అనేది ప్రాథమిక సమాచారం. అయినా విచారణను రెండు నెలలుగా నానుస్తున్నారు. లింగ నిర్ధారణ చేసినవారి నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం కూడా వాస్తవమే అయినప్పటికీ విచారణకు ఇంకా ఆదేశించలేదు. నెల రోజుల కిందటే కలెక్టర్ సుమిత్‌కుమార్ ఈ కేసు విషయంగా అప్‌డేట్స్ కనుక్కున్నట్లు సమాచారం.
అవినీతిని తట్టుకోలేక పంపేసిన నగరి ఎమ్మెల్యే
గతంలో నగరి నియోజకవర్గంలో ఈ సీఐ పనిచేస్తుండగా.. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని చిత్తూరు తీసుకొచ్చి లూప్‌లైన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికే చిత్తూరులో కీలక స్టేషన్‌ను అప్పగించారు.దీనిపై అటు పోలీసు శాఖలో, ఇటు రాజకీయవర్గాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
పాత సీఐపైన చర్యలేవీ?
అలాగే, ఇదే స్టేషన్‌లో ఇతడి కంటే ముందు పనిచేసిన ఓ సీఐ మీద కూడా తీవ్ర అవినీతి అరోపణలు వచ్చాయి. బంగారు నగల దొంగ వద్ద సుమారు రూ.12 లక్షలు, రెండు ఆభరణాలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల గురించి తెలిసిందే. ఆ దొంగ రాయచోటి క్రైమ్ పోలీసులకు దొరికిపోయి విషయం మొత్తాన్ని చెప్పేశాడు. అప్పటికే ఆ సీఐ.. 15 ఏళ్ల కిందట ఎస్‌ఐగా ఉన్నప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ అటవీశాఖ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదవ్వగా, సస్పెండ్ కూడా అయ్యారు. కెరీర్ మొత్తంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి మీద సాక్ష్యాలు దొరికినా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు.మూడు నెలల పాటు వీఆర్‌లో పెట్టి, ఆ మధ్య పుంగనూరు నియోజకవర్గంలో ఓ కీలక సర్కిల్‌కు సీఐగా నియమించారు. దీంతో అవినీతి అధికారులను అందలం ఎక్కిస్తున్నారని పోలీసు శాఖలోనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరు సీఐలూ ఉన్నతాధికారికి ప్రియ శిష్యులు కావడంతోనే చర్యలు తీసుకోవట్లేదని పోలీసు వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.