Share News

రైలునుంచి గర్భిణీని తోసేసిన కేసులో దోషికి జీవిత ఖైదు

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:18 AM

రైలు నుంచి గర్భిణీని తోసివేసిన ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం, బాధిత మహిళ (37)కు రూ. కోటి పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీచేసింది.

రైలునుంచి గర్భిణీని తోసేసిన కేసులో దోషికి జీవిత ఖైదు

- బాధితురాలికి రూ.కోటి పరిహారం

చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రైలు నుంచి గర్భిణీని తోసివేసిన ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం, బాధిత మహిళ (37)కు రూ. కోటి పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో భర్తతో కలిసి వుంటున్న ఆ గర్భిణి.. పుట్టిల్లైన చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరగా, వేలూరు జిల్లా గుడియాత్తం-కేవీ కుప్పం రైల్వే స్టేషన్ల మధ్య ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మహిళ తనను ప్రతిఘటించిందన్న కోపంతో ఆ వ్యక్తి రైలునుంచి కిందకు తోసివేశాడు.ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడడంతో పాటు ఆమెకు అబార్షన్‌ కూడా అయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళను రైలు నుంచి తోసివేసిన వేలూరు జిల్లా పూంజాలై గ్రామానికి చెందిన హేమరాజ్‌ (30)ను అరెస్ట్‌ చేశారు. హేమరాజ్‌పై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, తిరుపత్తూర్‌ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం హేమరాజ్‌ను దోషిగా తేల్చిన జిల్లా కోర్టు న్యాయాధికారిణి మీనాకుమారి..అతనికి 15 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, జీవితఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా బాధిత మహిళకు రైల్వేశాఖ రూ.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున రూ. కోటి పరిహారంగా అందించాలని ఆదేశించారు.

Updated Date - Jul 15 , 2025 | 02:18 AM