‘గ్రేటర్ తిరుపతి’కి సహకరించండి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:08 AM
గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటునందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.
తిరుపతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటునందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన రూపుదిద్దుకుందన్నారు. ప్రస్తుతం 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న తిరుపతి కార్పొరేషన్‌ను.. మరింతగా అభివృద్ధి పరచడానికి అదనంగా 270 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించాల్సి ఉందన్నారు. శెట్టిపల్లె లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేయవద్దని ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రిని కోరారు. ఇక్కడున్న వారంతా రైతులు, పేదలేనన్నారు, విలీనం వల్ల ఇళ్లకు పన్నులు పెరగడం.. ఖాళీ స్థలాలకూ పన్నులు చెల్లించాల్సి రావడం భారమవుతుందన్నారు. ఈ అభ్యంతరాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గ్రేటర్ తిరుపతిలో రేణిగుంట మండలం మొత్తాన్ని చేర్చాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరారు. గ్రేటర్‌కు తాము సంపూర్ణంగా సహకరిస్తామని, అయితే, ఈ ప్రతిపాదనపై తమను సంప్రదించలేదన్నారు. తమకు అవగాహన కల్పిస్తే పంచాయతీల్లో ప్రజలకు వివరించడానికి వీలవుతుందన్నారు.
గూడూరును నెల్లూరులో కలపండి
గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ మంత్రిని కోరారు. అప్పుడే తమ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అనుకూలంగానూ, సౌకర్యంగానూ ఉంటుందన్నారు. జిల్లాలు, డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేశాకే ప్రిలిమనరీ నోటిఫికేషన్ జారీ చేసిందని మంత్రి సమాధానమిచ్చారు. అభ్యంతరాలు తెలియజేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్
పర్యావరణంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచడంతో పాటు పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని అన్నారు. అందులో భాగంగా పులికాట్ కేంద్రంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 లేదా 17, 18 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రధాన దృష్టి
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తిరుపతి నియోజకవర్గంలో 22ఏ నిషేధిత జాబితాలోని భూములు దేవదాయశాఖ పరిధిలో లేకుంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల నిర్మాణాలకు.. పలు తహసిల్దారు కార్యాలయాల భవనాల మరమ్మతులకూ నిధులు కేటాయిస్తామన్నారు.
మొంథా.. ముంపు బాధితులకు సత్వర సాయం
మొంథా తుఫానులోను, కేవీబీపురం మండలం ఓలూరు రాయలచెరువు కట్ట తెగిన సమయంలోనూ బాధితులకు సత్వర సాయం అందించగలిగామని గణాంకాలు సహా కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఈనెల 22లోగా శెట్టిపల్లె భూముల అభివృద్ధి పనులు పూర్తి చేసి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గ్రేటర్ తిరుపతిలో 63 పంచాయతీలను విలీనం చేయాల్సి ఉండగా 13 మాత్రమే ఆమోదం తెలిపాయన్నారు. హథీరాంజీ మఠం భవన పునరుద్ధరణ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. మూడు గంటలకుపైగా సాగిన సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలుపై సమీక్షించారు. ఈ సమావేశంలో తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కురుగొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, బల్లి కళ్యాణ చక్రవర్తి, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు నరసింహయాదవ్, సుగుణమ్మ, రుద్రకోటి సదాశివం తదితరులతో పాటు కమిషనర్ మౌర్య, ఎస్పీ సుబ్బరాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.