కాంపౌండర్ టు కార్డియాలజిస్ట్!
ABN , Publish Date - Jul 05 , 2025 | 02:02 AM
చిత్తూరులో ఐదేళ్లుగా కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్న ఓ నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది.గుంటూరు జిల్లా చెరుకుపల్లెకు చెందిన వీరాంజనేయులు పదేళ్ల క్రితం ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ చేశాడు.కొంతకాలమయ్యాక గుంటూరులోని కొన్ని ఆస్పత్రుల్లో కాంపౌండర్‌గా పనిచేశాడు.

చిత్తూరులో ఐదేళ్లుగా రెండు, మూడు ఆస్పత్రుల్లో నకిలీ డాక్టర్ విధులు
యూట్యూబ్‌లో విడియోతో బయటపడ్డ బాగోతం
చిత్తూరు రూరల్, జూలై 4 (ఆంధ్రజ్యోతి):చిత్తూరులో ఐదేళ్లుగా కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్న ఓ నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది.గుంటూరు జిల్లా చెరుకుపల్లెకు చెందిన వీరాంజనేయులు పదేళ్ల క్రితం ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ చేశాడు.కొంతకాలమయ్యాక గుంటూరులోని కొన్ని ఆస్పత్రుల్లో కాంపౌండర్‌గా పనిచేశాడు.ఆ తర్వాత డాక్టర్‌గా అవతారం ఎత్తి పలు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆ విషయం బయటకు పొక్కి కేసులు నమోదు కావడంతో చిత్తూరుకు మకాం మార్చాడు.డాక్టర్ రమేష్‌బాబుగా పేరు మార్చుకుని నగరంలోని ఏకే అమ్మా ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా చేరిపోయాడు.కొన్ని సంవత్సరాల తరువాత మేనేజ్మెంట్‌తో తలెత్తిన విభేదాల కారణంగా రెండేళ్ల క్రితం సంతపేటలో ఉన్న లైఫ్‌లైన్ ఆస్పత్రిలో చేరాడు.ఏడేళ్ల క్రితం పెళ్లాడిన మహిళ అదనపు కట్నం కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇతడిపై అనుమానం వచ్చి విచారించగా అసలు డాక్టరే కాదని, ఎంతోమంది మహిళలను పెళ్లిపేరుతో మోసం చేశాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గుంటూరులో పోలీసులు కేసు నమోదు చేశారు.కార్డియాలజిస్ట్‌నంటూ వచ్చిన వ్యక్తి సర్టిఫికెట్లు పరిశీలించకుండా,వివరాలు తెలుసుకోకుండా ఆస్పత్రుల్లో ఎలా ఉద్యోగం ఇచ్చారో వైద్యాధికారులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఇంత గుడ్డిగా ఉద్యోగం ఇచ్చిన ఆస్పత్రుల యాజమాన్యాలది కూడా నేరమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో సుధారాణి తెలిపారు.