Share News

నిండా ముంచేశారు

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:19 AM

సూళ్లూరుపేట మండలంలో నకిలీ వరి విత్తనాలతో రైతులు మోసపోయారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్త సంచలనంగా మారింది. సూళ్లూరుపేటలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

నిండా ముంచేశారు
సూళ్లూరుపేట వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద వెన్ను తీసిన వరిపైరును చూపిస్తున్న వరదయ్యపాలెం మండలం కళత్తూరు గ్రామ రైతులు

- నకిలీ వరి విత్తనాలతో నష్టపోయిన రైతుల గోడు

- అనేక మండలాల నుంచి వస్తున్న రైతులు

- పట్టించుకోని వ్యవసాయాధికారులు

సూళ్లూరుపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట మండలంలో నకిలీ వరి విత్తనాలతో రైతులు మోసపోయారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్త సంచలనంగా మారింది. సూళ్లూరుపేటలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. శనివారం సూళ్లూరుపేటలో ఉన్న ఓ ప్రైవేట్‌ దుకాణం వద్దకు, వ్యవసాయశాఖ కార్యాలయానికి వెన్ను తీసిన వరిపైరును చేతపట్టుకుని ‘నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మునిగిపోయాం, న్యాయం చేయండి’ అంటూ పలువురు రైతులు వచ్చారు. సూళ్లూరుపేట మండలం నుంచేగాక తడ, దొరవారిసత్రం, వరదయ్యపాలెం, బీఎన్‌కండ్రిగ మండలాల నుంచి ఈ రైతులు వచ్చారు. దుకాణ యజమాని ‘మాదేమి లేదు కంపెనీ వారికి తెలిపాం.. వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు రోజుల తరువాత కొనుగోలు చేసిన బిల్లులు తీసుకుని రండి కంపెనీ వాళ్లు వస్తారు. మాట్లాడతారు’ అని సమాధానం చెప్పడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అక్కడి నుంచి వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

2వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

రబీ సీజన్‌లో సూళ్లూరుపేట వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో దాదాపు 13 వేల హెక్టార్ల పైగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బీపీటీ రకాల పంటను సాగు చేస్తారు. సూళ్లూరుపేటలో ఉండే ప్రైవేట్‌ డీలర్ల నుంచి సెప్టెంబరు, అక్టోబరు నెలలో బీపీటీ 2782 (జిలకర మసూర) రకాల వరి విత్తనాలను కొనుగోలు చేశారు. ఈ సీడ్‌ గోతాలపై అన్నపూర్ణ సీడ్స్‌ నంద్యాల అని ఉంది. నంద్యాల నుంచి ఈ విత్తనాలను సరఫరా చేశారని డీలర్లు తెలిపారు. ఈ విత్తనాలను సూళ్లూరుపేట మండలంలోనే కాకుండా తడ మండలం కారిజాత, వేనాడు, వాటంబేడు, గొల్లలమొలువు, దొరవారిసత్రంలో కల్లూరు, శ్రీధనమల్లి, పూలతోట, వరదయ్యపాలెం మండలంలో కళత్తూరు గ్రామ రైతులు దాదాపు 500 మందికి పైగా 1,500 వరి విత్తనాల సంచులను కొనుగోలు చేశారు. దాదాపు 2 వేల ఎకరాల్లో నాటిన పైరు 20 రోజులకే వెన్నుతీసి పంట నాశమైపోయింది. నాటిన 20 రోజులకే వెన్ను రావడమేమిటని రైతులు ఆ నోట ఈ నోట చెప్పుకుని నకిలీ విత్తనాలు వల్లేనని తెలియడంతో నిండా మునిగిపోయామని ఆందోళన చెందారు.

Updated Date - Nov 30 , 2025 | 01:20 AM