‘చాళుక్య’ సేల్‌పై కమిటీ
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:49 AM
తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన చాళుక్య హోటల్ స్థల విక్రయంపై కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.
తిరుపతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన చాళుక్య హోటల్ స్థల విక్రయంపై కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఎస్వీయూ సెనేట్ హాల్‌లో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 84 అంశాలపై చర్చించి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. నిధులకోసం ప్రత్యామ్నాయ మార్గాలవైపు కార్పొరేషన్ అన్వేషించాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోరారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అందరి సహకారంతో ముందుకు వెళతామని కమిషనర్ మౌర్య అన్నారు. సదరు స్థలాన్ని టీటీడీకి అప్పగించి సీవోసీ నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ఎస్కే బాబు సూచించారు. తూకివాకం వద్దగల కార్పొరేషన్ స్థలాన్ని విక్రయించే ఆలోచన చేయాలని మరో కార్పొరేటర్ న రసింహాచారి సూచించారు. చాళుక్య స్థలం విక్రయంపై వాడి, వేడిగా చర్చ సాగింది. కౌన్సిల్ ఎక్స్‌అఫిషియో సభ్యుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జోక్యం చేసుకుని కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. నిధులు లేకుండా నిలిచిపోయిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని పూర్తి చేసేందుకు నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని విక్రయించడమో, పీపీపీ ద్వారా కేటాయించడమో చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. దీనిపై కొందరు కుట్రపూరితంగా ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారని చెప్పారు. స్థల విక్రయానికి సంబంధించి రెండు వారాల్లో ఒక కమిటీ ఏర్పాటుచేసి, తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రతిపాదించగా కూటమి పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు.
అందుకే నేను వ్యతిరేకించలేదు
‘అజెండాలో ఉన్న చాళుక్య హోటల్ విక్రయించే అంశం ముందుగానే నా దృష్టికి వచ్చింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిసింది. అందుకే నేను వ్యతిరేకించలేదు’ అని మేయర్ శిరీష చెప్పారు. వ్యక్తిగతంగా స్థల విక్రయానికి తాను వ్యతిరేకినని చెప్పారు. డిప్యూటీ మేయర్లకు కారు అలవెన్సు అంశంపై వైసీపీ కార్పొరేటర్లు గణేష్, ఆరణి సంధ్య అభ్యంతరం చెబితే ఇలాంటి విషయాలపై చర్చపెట్టి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తామని, గతంలో ఎలా ఉందో అలాగే కమిషనర్ నిర్ణయం తీసుకుంటారని మేయర్ హుందాగా వ్యవహరించారు.
ఇలాగే వదిలేస్తే అదికూడా మిగలదు
‘కార్పొరేషన్‌కు తొలుత అధికారికంగా 92 సెంట్లు ఉండేది. ఈస్టు పోలీస్ స్టేషన్‌కు 15 సెంట్లు ఇచ్చారు. మిగిలింది 77 సెంట్లు ఉండాలి. కానీ పోలీస్ స్టేషన్ అధీనంలో మరో 15 సెంట్లు, ఫ్రీలెఫ్ట్ కోసం కొంత స్థలం, మరికొంత ఆక్రమణలు పోను, ఇప్పుడు సర్వే చేస్తే 39 సెంట్లు మాత్రమే ఉంది. ఇలాగే వదిలేస్తే 20 సెంట్లు కూడా మిగలదు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కార్పొరేషన్ భవనం 30 శాతమే నిర్మాణం జరిగింది. నేను వచ్చాక కాంట్రాక్టర్‌ను ఒత్తిడి చేసి 70 శాతం వరకు పూర్తి చేశాం. బకాయిలు ఇస్తేనే 6 నెలల్లో నిర్మాణం పూర్తిచేసుకోవచ్చు. అందుకే 30 ఏళ్లుగా వృథాగా ఉన్న స్థలాన్ని పీపీపీ విధానంలో ఇవ్వాలా? విక్రయించాలా? అని కౌన్సిల్ అనుమతి కోసం తీసుకొచ్చాం’ అని కమిషనరు మౌర్య అన్నారు.
దుష్ప్రచారం చేసినవారిపై కేసులు
అజెండాలో ప్రస్తావించని అంశాలను వైసీపీ నేతలు కాకిలెక్కలు వేసి అంకణం రూ.60వేలకు అమ్మేస్తున్నట్టు ప్రచారం చేయడం మంచిదికాదని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మండిపడ్డారు. ఇలా అసత్యప్రచారం చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండు చేశారు. కపిలతీర్థం సర్కిల్లో కారుచౌకగా కార్పొరేషన్ స్థలాన్ని కట్టబెట్టిన విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు.
మరో టూరిజం భవనంగా మార్చేస్తారా?
రుయాస్పత్రి ఎదురుగా నిధుల కొరతతో నిలిచిపోయిన టూరిజం భవనంలాగే మున్సిపల్ కార్యాలయాన్ని కూడా మార్చేస్తారా అంటూ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ప్రశ్నించారు. దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంకణం రూ.10లక్షలపైన వస్తే విక్రయించడం వల్ల ప్రజలకు అభ్యంతరం ఉండదన్నారు.