Share News

చిత్తూరు పాత బస్టాండులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:10 AM

రూ.30 కోట్లతో ఐదు అంతస్తుల నిర్మాణం ట్రిపుల్‌ పీ ప్రతినిధులతో ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ చర్చలు

చిత్తూరు పాత బస్టాండులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌
చిత్తూరు పాత బస్టాండు

చిత్తూరు అర్బన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెండే దశాబ్దాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న చిత్తూరు పాత బస్టాండు రూపు రేఖలు మారనున్నాయి. త్వరలో ఇక్కడ భారీ ఎత్తున కమర్షియల్‌ కాంప్లెక్సును నిర్మించనున్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్‌ చొరవ తీసుకుని సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నారు.ఈ క్రమంలో బుధవారం అమరావతి నుంచి వచ్చిన పబ్లిక్‌, ప్రైవేటు, పార్ట్‌నర్‌షి్‌ప(పీపీపీ) ప్రతినిధులు మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే జగన్మోహన్‌, కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌తో చర్చలు జరిపారు.

అమలు దిశగా ఎన్నికల హామీ

చిత్తూరు నడిబొడ్డున సుమారు ఒకటిన్నర ఎకరా స్థలంలో కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రైవేటు బస్టాండు ఉంది. గతంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులన్నీ ఇక్కడి నుంచే వెళ్లేవి. నగర జనాభాతో పాటు సర్వీసుల సంఖ్య పెరగడంతో రెండు విడతల్లో కట్టమంచి చెరువు సమీపంలోకి ఆర్టీసీ, ప్రైవేటు బస్టాండులను మార్చారు. కొంతకాలం ప్రైవేటు బస్సులు ఇక్కడ ఆగినా.. చాలాకాలంగా ఈ ప్రాంతం ఖాళీగా ఉంది. ఎన్నికల సమయంలో చిత్తూరు పాత బస్టాండును అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గెలిచిన తర్వాత అక్కడి కూరగాయల, పండ్ల మార్కెట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంది.దీంతో పాటు హైరోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రెండూ పూర్తయితే చిత్తూరు నగర రూపురేఖలు మారనున్నాయి.

డిసెంబరులో అగ్రిమెంటు....

పీపీపీ విధానంలో పాత బస్టాండు ప్రాంతంలో అత్యాధునిక మల్టీప్లెక్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రిపుల్‌ పీ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ గోగన్‌కర్‌ బుధవారం చిత్తూరులో ఎమ్మెల్యే జగన్మోహన్‌, మేయర్‌ అముద, కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రాథమికంగా ఒకటిన్నర ఎకరా స్థలంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో బస్టాండ్‌తో పాటు పైన ఐదు అంతస్తుల వరకు కమర్షియల్‌ కాంప్లెక్సులను నిర్మించాలని నిర్ణయించారు. వచ్చే నెలాఖరులోగా డిజైన్‌, అనుమతులు పూర్తి చేసుకుని డిసెంబరులో అగ్రిమెంటు చేసుకునేలా చర్చలు జరిగాయి. ఒప్పందం చేసుకున్న రోజు నుంచి రెండేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. దీనికి మొత్తం రూ.30 కోట్ల ఖర్చు అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 01:10 AM