Share News

మా ఇంటికి రండి! ఆశీర్వదించి వెళ్లండి

ABN , Publish Date - May 25 , 2025 | 01:04 AM

ఇంటింటా సందడే. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు తెలియని హడావుడే. అవును.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారంనాడు గృహప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఆయనతోపాటు కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు.

మా ఇంటికి రండి! ఆశీర్వదించి వెళ్లండి
గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు శనివారం రాత్రి 11.30 గంటలకు కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

చంద్రబాబు గృహప్రవేశానికి ఇంటింటికీ అందిన ఆహ్వానం

కుటుంబ సమేతంగా కుప్పం చేరుకున్న సీఎం

పాతికవేలమందికి పైగా భోజనాలకు ఏర్పాట్లు

ఇంటింటా సందడే. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు తెలియని హడావుడే. అవును.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారంనాడు గృహప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఆయనతోపాటు కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరఫున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆ పండుగకు హాజరై చంద్రబాబు కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, విందు భోజనాలు చేసి రావడానికి తయారవుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఎమ్మెల్యే కూడా. అంతమాత్రమేనా.. నిరంతరం వారి క్షేమసమాచారాలు కనుక్కుంటూ బాగోగులు చూసే సొంత కుటుంబ సభ్యుడు కూడా. అందుకే కుప్పంలో ఈ హడావుడి.

కుప్పం, మే 24 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురంవద్ద రెండెకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు.సతీమణి నారా భువనేశ్వరితో కలిసి కుటుంబ సమేతంగా ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల మధ్య గృహప్రవేశం చేయనున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకుని పీఈఎస్‌ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు.నూతన గృహానికి వెళ్లి, అక్కడి గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్‌తో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో కుప్పం చేరుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి తర్వాత కుప్పం వచ్చారు.గృహప్రవేశ ఏర్పాట్లు ఘనంగానే జరుగుతున్నాయి. సుమారు 25వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు.ఇందుకు అవసరమైన ప్రత్యేకమైన షెడ్లను నూతన గృహ పరిసరాలలో నిర్మించారు. శనివారం రాత్రి సైతం ఇంటివద్ద బంధుమిత్రులకు, వీఐపీలకు భోజనాలు చేసి వడ్డించారు. ఆదివారం మధ్యాహ్నం వేల సంఖ్యలో జనం భోజనాలు చేయనున్నారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను ఇందుకోసం సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచే వంట ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. నారా భువనేశ్వరి దగ్గరుండి వంటకాలను సిద్ధం చేయించడమే కాక, అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. 25 వేలమంది సాధారణ ప్రజలకు, 2 వేలమంది వీఐపీలకు భోజనాలు సిద్ధం చేస్తున్నారు.

అందరికీ ఆహ్వానాలు

ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కూడా కావడంతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబనుంచి కనీసం ఒక్కరైనా గృహప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానం పలకాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ ఆహ్వాన పత్రికలు పెట్టడంతోపాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామానికి వెళ్లి ముద్రించిన పత్రికలను పంచి గృహప్రవేశానికి ప్రజలను ఆహ్వానించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ బీఆర్‌.సురేశ్‌బాబు, కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌లతోపాటు మిగిలిన రెండు మూడు మండలాల అధ్యక్షులు ఆహ్వానం పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో మెసేజ్‌లు పెట్టారు.కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ శనివారం మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి ఆహ్వానపత్రికలు పంచి, పసుపు కుంకుమలు ఇచ్చి మరీ ప్రత్యేకించి మహిళలను సంప్రదాయబద్ధంగా గృహప్రవేశానికి ఆహ్వానించారు.

విందు భోజనం మెనూ

సంప్రదాయ తీపి పదార్థాలు: చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా

కారం: సమోసా

అన్నాలు: వెజ్‌ బిరియాని, టమోటా రైస్‌, రైతా

కూరలు: మ్యాంగో రైస్‌, గుత్తివంకాయ మసాలా, మష్‌రూమ్‌ గుజ్జు కూర, బెండకాయ తాళింపు, బంగాళాదుంపల తాళింపు, వడ పులుసు

భోజనం: తెల్ల అన్నం, ఘీ రైస్‌, సాంబారు, రసం, ఆవకాయ, గోంగూర పండు మిరపకాయ పచ్చడి, అప్పడం, పెరుగు

డెజర్ట్‌: క్యారెట్‌ హల్వా, ఐస్‌ క్రీమ్‌

తాంబూలం: మీఠా పాన్‌

Updated Date - May 25 , 2025 | 01:04 AM