దేవతలారా రారండి
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:35 AM
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణం
తిరుచానూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సకల దేవతలు అతిథులుగా వచ్చారు. భక్తులు ఆనందపరవశం కాగా ధ్వజపటం పైకి ఎగిరింది. బ్రహాండనాయకుడి ప్రియదేవకి పద్మావతి బ్రహ్మోత్సవం మొదలైంది. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేందుకు సోమవారం ఉదయం ఽధ్వజస్తంభం ఎదుట పూజలు చేశారు. సకలదేవతామూర్తులను పండితులు ఆహ్వానించి దిగ్బంధనం చేశారు. ఉదయం 6 గంటలకు చక్రాత్తాళ్వార్ ముందుకు సాగగా వెనకే అమ్మవారికి అభిముఖంగా గజచిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి అంకురార్పణ సందర్భంగా యాగశాలలోని కలశాల్లో నింపిన నవధాన్యాలు అంకురించాయి. వీటిని తీసుకొచ్చి ధ్వజస్తంభం ముందు ఉంచి పూజలు చేశారు. 9.30 గంటలకు ధనుర్లగ్నంలో వేడుకగా ధ్వజారోహణం చేశారు. కంకణభట్టారు వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది. మాడవీధుల్లో భక్తులందరూ అమ్మవారి వాహనసేవ తిలకించేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జియ్యర్‌స్వాములు, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ. ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాసాచారులుబాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, టెంపుట్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, చలపతి, సుబ్బరాయుడు సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
చిన్నశేషుడిపై అమ్మ చిద్విలాసం
తొలిరోజైన సోమవారం రాత్రి 7 గంటలకు అమ్మవారు పరమ వాసుదేవుడు అలంకారంలో చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. కాగా, మధ్యాహ్నం 12.30 గంటలకు అమ్మవారికి శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం.. ఆస్థాన మండపంలో సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించారు.
వజ్రకిరీటం, లక్ష్మీహారంతో అమ్మవారి దర్శనం
అమ్మవారి మూలమూర్తికి శుక్రవారం వజ్రకిరీటం, సహస్ర నామాలు కలిగిన బంగారు లక్ష్మీకాసుల హారం, లక్ష్మీనారాయణ కాసుల హారం అలంకరించారు. విశేష పర్వదినాల్లో మాత్రమే అమ్మవారికి వజ్రకిరీటం అలంకరించడం పరిపాటి. ఇక, బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారి ఉత్సవర్లు అద్దాల మండపంలో కొలువై ఉంటారు.
తిరుచానూరులో తిరుమల లడ్డూలు
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూలను తిరుచానూరు ఆలయంలో అందుబాటులో ఉంచారు. ఆలయం లోపల కౌంటర్‌లో టికెట్లు తీసుకుని.. బయట కౌంటర్‌లో లడ్డూలు పొందాలని ప్రసాదాల ఇన్‌స్పెక్టర్ సుబ్బరాయుడు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 8 గంటలకు పెద్దశేష.. రాత్రి 7 గంటలకు హంస వాహనాలపై అమ్మవారు ఊరేగనున్నారు.