Share News

జాబిలిపై చల్లని తల్లి

ABN , Publish Date - Nov 24 , 2025 | 01:14 AM

శ్రీపద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

జాబిలిపై చల్లని తల్లి

చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన పద్మావతీ దేవి

ఉదయం సూర్యప్రభపై వెలుగులీనిన అమ్మవారు

తిరుచానూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): శ్రీపద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి తీసుకొచ్చి విశేష ఆభరణాలు, పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలలతో అలంకరించి, అధిష్ఠింపజేశారు. గజ, తురగ, అశ్వాలు ముందుకు సాగుతుండగా జియ్యర్‌ స్వాములు దివ్యవ ప్రబంధ పారాయణం, మంగళవాయిద్యం, చిన్నారుల కోలాటం, భజన బృందం కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఊరేగింపు సాగింది. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చారు. యోగనారాయణుడి సూర్యప్రభ వాహనంపై పద్మావతీ అమ్మవారు భక్తులను కటాక్షించారు. తిరుమాడవీధుల్లో సూర్యప్రభ వాహనసేవ అత్యంత వేడుకగా సాగింది. మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవమూర్తికి కేటీ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జియ్యర్‌ స్వాములు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్‌, టెంపుట్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు, సుభాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న వాహన సేవలు

పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న చిన్నశేష వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు సోమవారం రాత్రి అశ్వ వాహనంతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల్లో 16 వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను కటాక్షించారు.

రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

మంగళవారం జరిగే పంచమి తీర్థంతో అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అదే రోజు తిరుమల నుంచి అమ్మవారికి శ్రీవారి సారె రానుంది.

బ్రహ్మోత్సవాల్లో నేడు

ఉదయం 9.15 గంటలకు రథోత్సవం

సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ

రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం

Updated Date - Nov 24 , 2025 | 01:14 AM