చలిపులి పంజా
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:49 AM
తిరుపతి జిల్లాను చలిపులి వణికిస్తోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కురుస్తోంది. పగటి సమయంలోనూ చలివాతావరణం కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. పగటిపూట కొన్నిచోట్ల ఎండ కూడా కనిపించడంలేదు. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రోజురోజుకూ తగ్గుతున్నఉష్ణోగ్రతలు
తిరుపతిలో 17 డిగ్రీల నమోదు
పెరిగిన మంచు తీవ్రత
తిరుపతి(కలెక్టరేట్) డిసెంబరు 13(ఆంరఽధజ్యోతి): జిల్లాను చలిపులి వణికిస్తోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కురుస్తోంది. పగటి సమయంలోనూ చలివాతావరణం కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. పగటిపూట కొన్నిచోట్ల ఎండ కూడా కనిపించడంలేదు. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గత ఏడాదితో పోల్చితే తగ్గిన ఉష్ణోగ్రతలు
గత ఏడాది డిసెంబరుతో పోల్చితే జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతకంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. గత డిసెంబరు ఇదే రోజు జిల్లాలో 21 డిగ్రీలు నమోదు కాగా ఈ ఏడాది 17 డిగ్రీలకు పడిపోయింది. తిరుమలలో రాత్రివేళల్లో 14 డిగ్రీలే నమోదవుతోంది. గత ఏడాది ఇదే మాసంలో జిల్లాలో గరిష్టంగా 26.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది గడచిన వారం రోజులుగా 23 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఆది, సోమ, మంగళవారాల్లోనూ 17 డిగ్రీలు నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..
జిల్లాలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. 1న సోమవారం 23, 2న 22.1, 3న 22.6, 4న 22.3, 5న 23.6, 6న 22.8, 7న 21.9, 8న 20.5, 9న 21.6, 10న 20.6, 11న 20.6, 12న 19.1, శనివారం 17.1 డిగ్రీలు నమోదైంది.
జాగ్రత్తలు అవసరం..
గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు దగ్గు, జ్వరం బాధితులు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని తెలిపారు. రాత్రిపూట వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.