కుప్పంలో సీఎం ‘ఉపాధి’ యజ్ఞం!
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:37 AM
చంద్రబాబు ‘ఉపాధి’ యజ్ఞం చేస్తున్నారని ఎమ్మెల్సీ, కడా సలహా మండలి అధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం (పీఎ్‌సఎం) అన్నారు
కుప్పం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలో యువతకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఉపాధి’ యజ్ఞం చేస్తున్నారని ఎమ్మెల్సీ, కడా సలహా మండలి అధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం (పీఎ్‌సఎం) అన్నారు. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (కడా), 1ఎం1బీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కడా కార్యాలయం ఆవరణలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కంచర్ల, పీఎ్‌సఎం ప్రసంగించారు. కుప్పం యువత ఒకప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారన్నారు. దీన్ని నివారించడానికి 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక యువతకోసం కడా ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేటు ఏజన్సీల భాగస్వామ్యంతో ఉద్యోగ, ఉపాధి కల్పనకు తెరతీశారని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఉద్యోగ మేళాలో సుమారు 600 మంది ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో పలు పరిశ్రమలు స్థాపిస్తున్నామని, ఇందులో కూడా ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. కడా పీడీ వికాస్ మర్మత్ మాట్లాడుతూ.. జాబ్‌మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కడా సలహా మండలి సభ్యులు డాక్టర్ బీఆర్ సురేశ్‌బాబు, రాజ్ కుమార్, నరేశ్, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
500 మందికిపైగా ఉద్యోగావకాశాలు
జాబ్‌మేళాలో 500 మందికి పైగా యువతీ యువకులు ఉద్యోగావకాశాలు పొందారు. వీరికి ఐటీ, ఫార్మా, రిటైల్, హెల్త్ కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన సుమారు 50కిపైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ కంచర్ల, పీఎ్‌సఎం, కలెక్టర్ సుమిత్‌కుమార్ నియామకపత్రాలు అందజేశారు.