Share News

గంగమ్మ విశ్వరూప దర్శనానికి సీఎం

ABN , Publish Date - May 18 , 2025 | 01:40 AM

21న పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

గంగమ్మ విశ్వరూప దర్శనానికి సీఎం
ద్రావిడ వర్శిటీ క్రీడాప్రాంగణంలో హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల, పీఎస్‌ఎం తదితరులు

కుప్పం, మే 17 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప దర్శనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈనెల 21వ తేదీన ఆయన కుప్పం వచ్చి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గంగమ్మ జాతర మహోత్సవాలు ఈనెల 14న వినాయక ఉత్సవంతో ప్రారంభమై అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.టీడీపీ నాయకుల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 21వ తేదీన కుప్పం వచ్చి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. అధికారిక షెడ్యూల్‌ ఇంకా రాకపోయినా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ బీఆర్‌.సురేశ్‌బాబు, టీడీపీ మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ తదితరులు డీఎస్పీ పార్థసారథితో కలిసి పరిశీలించారు. ద్రావిడ విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రాంతంతోపాటు కుప్పం గంగమ్మ ఆలయంనుంచి యూనివర్శిటీ దాకా రాకపోకలు సాగించే మార్గాన్ని సైతం పరిశీలించారు. టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జులు వీజీ.ప్రతాప్‌, సత్యేంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు ఇంటివద్ద ముమ్మర ఏర్పాట్లు

శాంతిపురం, మే 17 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25న గృహప్రవేశం చేయనుండడంతో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ, శివపురం గ్రామ పరిధిలో నిర్మిస్తున్న ఇంటివద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో ఇంటి వద్ద పొక్లయిన్ల ద్వారా చదును చేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.గృహప్రవేశ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానుండడంతో అందుకు తగ్గ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.వేలాదిమందికి అన్నదానం చేసేందుకు ఇంటి పక్కనే భూమిని చదును చేస్తున్నారు.తుమ్మిశి వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - May 18 , 2025 | 01:40 AM