Share News

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:22 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
రేపు సీఎం ప్రారంభించనున్న ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

తిరుమల/తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీనికోసం ఆయన బుధవారం సాయంత్రం హెలికాప్టర్‌లో తిరుపతిలోని తాజ్‌ హోటల్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన తిరుమలలోని గాయత్రి నిలయానికి వస్తారు. రాత్రి 7.40గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయనకు అర్చకులు పరివట్టం చుట్టగా తలపై వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను ఈవో ఉంచుతారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని వస్త్రాలను బహూకరించి మూలవర్లను దర్శించుకుంటారు. రంగనాయకుల మండపంలో టీటీడీ 2026 డైరీ, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారు. వాహన మండపం వద్ద పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. గురువారం ఉదయం 9.10 గంటలకు భక్తుల వసతిగృహం వెంకటాద్రి నిలయాన్ని ప్రారం భిస్తారు. ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను(ఐసీసీసీ)- ఇంటెలిజెంట్‌ క్రౌడ్‌ అండ్‌ సైబర్‌కంట్రోల్‌, ప్రసాదాలకు సంబంధించిన ప్లాంట్‌ను ప్రారంభించి తిరుగు ప్రయాణమవుతారు. అలాగే, మంత్రి నారా లోకేశ్‌ కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి హెలికాప్టర్‌లో బుధవారం సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గాన తిరుమలలోని గాయత్రి గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి 7.30 నుంచీ 9 గంటల నడుమ శ్రీవారిని దర్శించుకుంటారు. గురువారం ఉదయం 10.15 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - Sep 24 , 2025 | 12:22 AM