29న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:40 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29వ తేదీన కుప్పం పర్యటనకు రానున్నారు.శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలో ఇటీవల గృహప్రవేశం చేసిన ఇంట్లోనే ఆయన కార్యక్రమం పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇందుకోసమే ఆ గృహం ఉన్న పరిసర ప్రాంతాల్లో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన స్థలంకోసం అధికార వర్గాలు పరిశీలన జరుపుతున్నాయి.
కుప్పం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29వ తేదీన కుప్పం పర్యటనకు రానున్నారు.శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలో ఇటీవల గృహప్రవేశం చేసిన ఇంట్లోనే ఆయన కార్యక్రమం పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇందుకోసమే ఆ గృహం ఉన్న పరిసర ప్రాంతాల్లో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన స్థలంకోసం అధికార వర్గాలు పరిశీలన జరుపుతున్నాయి. తుమ్మిశిలోని పాత హెలిప్యాడ్, కనమనపల్లె, శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, మఠం గ్రామ సమీపం తదితర ప్రాంతాలలో ఇప్పటికే సుమారు రెండుమూడు సార్లు అధికారులు హెలిప్యాడ్‌కోసం పరిశీలనలు చేశారు.ఎస్పీ మణికంఠ, స్థానిక డీఎస్పీ పార్థసారథితో కలిసి శనివారం మరోసారి స్థల పరిశీన జరిపారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 28వ తేదీ సాయంత్రం కుప్పం వచ్చి 29న సమావేశం ముగించుకుని అదే రోజు సాయంత్రం పయనమవుతారా? లేక 29వ తేదీ ఉదయం కుప్పం చేరుకుని, 30వ తేదీ తిరుగు పయనమవుతారా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి రాజకీయ కార్యక్రమమనే తెలుస్తున్నా, అధికారిక కార్యక్రమాలు సైతం ఏవైనా ఉంటాయా అన్న విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. కార్యక్రమాల విషయం ఎలా ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన మాత్రం 29వ తేదీన కచ్చితంగా ఉంటుందని అధికార వర్గాల చర్యల ద్వారా అర్థమవుతోంది.