Share News

పులికాట్‌ వద్ద క్లబ్‌ మహీంద్రా రిసార్ట్స్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:27 AM

జిల్లాకు మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. తడ మండలం పులికాట్‌ సరస్సు వద్ద క్లబ్‌ మహీంద్రా రిసార్ట్స్‌.. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌ నిర్వహిస్తున్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ సెంటర్‌ను రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసే అవకాశం ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు.

పులికాట్‌ వద్ద క్లబ్‌ మహీంద్రా రిసార్ట్స్‌

విమానాశ్రయం వద్ద ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సెంటర్‌

ఇప్పటికే అనువైన భూములు గుర్తించామన్న కలెక్టర్‌

తిరుపతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. తడ మండలం పులికాట్‌ సరస్సు వద్ద క్లబ్‌ మహీంద్రా రిసార్ట్స్‌.. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌ నిర్వహిస్తున్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ సెంటర్‌ను రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసే అవకాశం ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అనువైన భూములు గుర్తించామని చెప్పారు. బుధవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తడ మండలంలో పులికాట్‌ సరస్సు వద్ద క్లబ్‌ మహీంద్రా లగ్జరీ రిసార్ట్స్‌ ఏర్పాటు చేయడానికి వీలుగా 30 ఎకరాలు గుర్తించామన్నారు. మహీంద్రా సంస్థ ప్రతినిధులు ఆ భూమిని పరిశీలించారన్నారు. గుర్తించిన 30 ఎకరాల్లో క్లబ్‌ మహీంద్రా సంస్థకు 20 ఎకరాలు కావాల్సి ఉందన్నారు. టూరిజం అభివృద్ధికి గణనీయంగా అవకాశమున్న పులికాట్‌ సరస్సు ప్రాంతంలో ఈ సంస్థ రిసార్ట్స్‌ ఏర్పాటు చేస్తే జిల్లా ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందన్నారు. రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్నట్లుగా తిరుపతికి చేరువలో సెంటర్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోందన్నారు. దానికోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరువగా 30 ఎకరాలు గుర్తించామని, ఆ సంస్థ ప్రతినిధులు కూడా పరిశీలించి వెళ్లారన్నారు. ఇప్పటికే తిరుపతి, పరిసరాల్లో ఆధ్యాత్మిక రంగానికి చెందిన అనేక ఆశ్రమాలు, మఠాలు స్కూళ్ళు, కాలేజీలు, కేంద్రాలు వంటివి ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాయని కలెక్టర్‌ గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సెంటర్‌ ఏర్పాటైతే తిరుపతికి మరింత గుర్తింపు వచ్చి పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. వడమాలపేట మండలం ఎస్వీపురం వద్ద 12.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీకి అప్పగించే ప్రతిపాదనలకు మంత్రివర్గం మంగళవారం ఆమోదించిందన్నారు. ఆ భూమిని ఏపీ టూరిజం అథారిటీ అభివృద్ధి చేసి హోటళ్ళు, రిసార్ట్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు లీజు ప్రాతిపదికన అప్పగిస్తుందన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:27 AM