Share News

శెట్టిపల్లె ఫైల్స్‌ క్లియర్‌!

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:35 AM

ఇక, శెట్టిపల్లె భూ సమస్య కనిపించదు. బాధితుల గోడు అసలు వినిపించదు. దశాబ్దాల వివాదానికి కూటమి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. శాశ్వత పరిష్కారం చూపుతూ సీఎం నారా చంద్రబాబు నేతృత్వంలో గురువారం జరిగిన కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

శెట్టిపల్లె ఫైల్స్‌ క్లియర్‌!

స్థలాల యజమానులకు కనీసం 2 సెంట్ల కేటాయింపు

మంత్రి వర్గంలో నిర్ణయం

దశాబ్దాల వివాదానికి చెక్‌ పెట్టిన ప్రభుత్వం

ఇక, శెట్టిపల్లె భూ సమస్య కనిపించదు. బాధితుల గోడు అసలు వినిపించదు. దశాబ్దాల వివాదానికి కూటమి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. శాశ్వత పరిష్కారం చూపుతూ సీఎం నారా చంద్రబాబు నేతృత్వంలో గురువారం జరిగిన కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

తిరుపతి నగరపరిధిలోని శెట్టిపల్లెలో సర్వే లెక్కల ప్రకారం దాదాపు 636 ఎకరాలున్నాయి. దాదాపు 500 కుటుంబాలు వ్యవసాయాన్నే జీవనాధారంగా నమ్ముకుని జీవించేవారు. 3-5-1979లో ఇనామ్‌ చట్టం రద్దయింది. అదే ఏడాది జూన్‌ 25న శెట్టిపల్లె గ్రామం ఏర్పాటైంది. 1980-81 మధ్య కాలంలో సాగుబడిని అనుభవంగా పరిగణనలోకి తీసుకున్న అప్పటి కలెక్టర్‌.. అనుభవంలో ఉన్నవారి భూములను గుర్తించి, గట్టువారి సర్వే నిర్వహించి రఫ్‌ పట్టాలను మంజూరు చేశారు. రఫ్‌ పట్టాల ఆధారంగానే భూమి హక్కుదారులుగా ఉండేవారు. క్రయవిక్రయాలు కూడా పెద్దఎత్తున జరిగాయి. ఈ నేపథ్యంలోనే 82.67 ఎకరాలను రైల్వే శాఖ తిరుపతి సీఆర్‌ఎస్‌ కోసం భూములు తీసుకుని పరిహారం చెల్లించింది. భూములు కోల్పోయిన ప్రతి ఇంటికి సీఆర్‌ఎ్‌సలో ఓ ఉద్యోగాన్ని కల్పించింది. నగరానికి దగ్గరగా ఉండడంతో రఫ్‌ పట్టాలతో క్రయవిక్రయాలు జరగ్గా.. ఒకే ప్లాట్‌ను ఇద్దరు, ముగ్గురుకు కూడా విక్రయించినట్టు వెలుగులోకి వచ్చింది. ఈవివాదానికి బ్రేక్‌ వేస్తూ 2015లో సీఎం చంద్రబాబు నాయుడు శెట్టిపల్లె భూములను 22ఏలో చేర్చారు. దీంతో రిజిస్ట్రేషన్‌ జరగకుండా అడ్డుకోగలిగారు.

వైసీపీ పొలిటికల్‌ గేమ్‌

భూములు తమ అనుభవంలో ఉన్నా, అక్కరకు అమ్ముకోవాలన్నా కుదరదు. ఎవరు ఆక్రమిస్తారోనన్న అందోళన. నిజమైన హక్కుదారులే శెట్టిపల్లె భూముల్లో బాధితులయ్యారు. రెండు నియోజకవర్గాలతో ముడిపడిన ఆ ప్రాంతంపై వైసీపీ పెద్దల కన్ను పడింది. మేం చేస్తాం...మేమే చేశాం...అంటూ ఎవరికివారు మభ్యపెట్టారు. ఖాళీ ప్రొసీడింగ్స్‌ కాపీలు చేతిలోపెట్టి సమస్యను సెటిల్‌ చేసేశామంటూ చెప్పారు. హక్కుదారులు స్థలాల దగ్గరకు వెళితే రెవెన్యూ వాళ్లు అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఇలా వీరితో వైసీపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడింది.

క్లియర్‌ చేసిన కూటమి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం శెట్టిపల్లి భూముల సమస్యను కొలిక్కి తెచ్చింది. స్థలాల యజమానులకు కనీసం 2 సెంట్ల చొప్పున కేటాయించేందుకు గురువారం నాటి మంత్రిమండలిలో అంగీకరించింది. 2400 మంది యజమానుల్లో 1700 మందికి పైగా యజమానులకు 4 సెంట్లలోపే స్థలాలున్నాయి. వారికి ల్యాండ్‌ పూలింగ్‌లో ఒకటన్నర సెంటు కంటే తక్కువ స్థలాలు దక్కనున్నాయి. దీంతో రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదన మేరకు మంత్రి మండలి కనీస స్థలం 2 సెంట్లు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించింది. దానివల్ల 1700 కుటుంబాలకు లబ్ధి కలగనుంది.

చంద్రబాబు విజన్‌తో మహర్దశ

చంద్రబాబు విజన్‌తో శెట్టిపల్లెకు మహర్దశ రానుంది. వెడ్డింగ్‌ డెస్టినేషన్‌, స్టార్‌ హోటల్స్‌ ఏర్పాటుచేసే ఆలోచనలు యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌ నిర్ణయం మేరకు 227 ఎకరాల్లో టౌన్‌షి్‌ప వేస్తారు. ఇందులో దాదాపు 2500 మంది బాధితులకు (ప్లాట్‌ ఓనర్లకు 50:50, అగ్రికల్చర్‌ 30:70 చొప్పున) ప్లాట్లు కేటాయిస్తారు. 65 ఎకరాలు తుడాకు, 90 ఎకరాలు ప్రభుత్వం ఉంచుకుంటుంది. తుడాకు కేటాయించే 65 ఎకరాలు ఎంఐజీ లేఅవుట్‌లు వేసి విక్రయించగా వచ్చిన ఆదాయంతో టౌన్‌షి్‌ప రూపొందిస్తుంది. ప్రభుత్వం వద్ద ఉండే భూములను భవిష్యత్‌ అవసరాలతో పాటు వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ సెంటర్‌గా మార్చనుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

తాము అధికారంలోకి వస్తే శెట్టిపల్లె భూ సమస్యను సెటిల్‌ చేస్తామని ఎన్నికలముందు హామీ ఇచ్చాం. ఆమేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఎట్టకేలకు సమస్యను సుఖాంతం చేయగలిగాం.

- ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే, తిరుపతి

అందరికీ 2సెంట్లు ఇచ్చేలా సీఎం నిర్ణయం

కేబినెట్‌ అజెండాలో తొలుత శెట్టిపల్లి కనిపించలేదు. సీఎం చంద్రబాబుగారికి వివరించి అడిషనల్‌ అజెండాలో చేర్చాం. హౌస్‌ఫర్‌ఆల్‌ స్కీం కింద 2 సెంట్లు ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల తుడా 7 ఎకరాలు నష్టపోయినా, బాధితులు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

- డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి, తుడా ఛైర్మన్‌

మీకు రుణపడి ఉంటాం

ఫ కలెక్టర్‌కు శెట్టిపల్లె భూబాధితుల కృతజ్ఞతలు.. సన్మానం

తిరుపతి(క్రీడలు), సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపారని, రుణపడి ఉంటామని భూబాధితుల కమిటీ గురువారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి వర్గ నిర్ణయం తెలిసిన వెంటనే వీరు కలెక్టర్‌ను కలిశారు. మీ కృషి ఫలితంగానే మాకు న్యాయం జరిగిందంటూ సంతోషం వ్యక్తంచేశారు. మాటిచ్చి నెరవేర్చినందుకు సంతృప్తిగా ఉందని, రెండు నెలల్లో పూర్తిగా సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ వారికి చెప్పారు. కమిటీ అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణ, శ్రీనివాసులు, రాజేంద్ర, సురేష్‌, జ్యోతిరెడ్డి, నాదముని, చిరంజీవి, బుజ్జి పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:35 AM