Share News

స్వచ్ఛత... కుప్పం మున్సిపాలిటీ!

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:32 AM

కుప్పం పురపాలక సంఘం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికైంది. మున్సిపల్‌ కమిషనర్‌ అవిరామ కృషి, సిబ్బంది తోడ్పాటు ఇందుకు కారణమైంది. మరో ఆరు నెలల్లో జీరో వేస్ట్‌ మున్సిపాలిటీగా తయారు చేయాలన్న లక్ష్యంతో అధికార, పాలక యంత్రాంగం ముందుకు సాగుతోంది. అమరావతిలో ఈనెల 6వ తేదీన జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర అవార్డును అందుకోనున్న నేపథ్యంలో ఈ అవార్డు వెనుక ఉన్న కృషిని గురించి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం పురపాలక సంఘానికి ప్రత్యేక స్థానముంది. వేల కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. మోడల్‌ మున్సిపాలిటీగా తయారు చేసే క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక పథకాలు అమలవుతున్నాయి. ఎంత అభివృద్ధి చెందినా చెత్త కుప్పలు, పూడిక తీయని మురుగు కాలువలతో మున్సిపాలిటీ కంపు కొడుతుంటే చేసిన శ్రమ నిష్ఫలమైనట్లే. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ వి.శ్రీనివాసరావు నిరంతరం శ్రమిస్తున్నారు.

స్వచ్ఛత... కుప్పం మున్సిపాలిటీ!
చెత్త రహితంగా కనిపిస్తున్న కుప్పం మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డు

  • స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపిక

కుప్పం, అక్టోబరు 3 (ఆంఽధ్రజ్యోతి): కుప్పం పురపాలక సంఘం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికైంది. మున్సిపల్‌ కమిషనర్‌ అవిరామ కృషి, సిబ్బంది తోడ్పాటు ఇందుకు కారణమైంది. మరో ఆరు నెలల్లో జీరో వేస్ట్‌ మున్సిపాలిటీగా తయారు చేయాలన్న లక్ష్యంతో అధికార, పాలక యంత్రాంగం ముందుకు సాగుతోంది. అమరావతిలో ఈనెల 6వ తేదీన జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర అవార్డును అందుకోనున్న నేపథ్యంలో ఈ అవార్డు వెనుక ఉన్న కృషిని గురించి తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం పురపాలక సంఘానికి ప్రత్యేక స్థానముంది. వేల కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. మోడల్‌ మున్సిపాలిటీగా తయారు చేసే క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక పథకాలు అమలవుతున్నాయి. ఎంత అభివృద్ధి చెందినా చెత్త కుప్పలు, పూడిక తీయని మురుగు కాలువలతో మున్సిపాలిటీ కంపు కొడుతుంటే చేసిన శ్రమ నిష్ఫలమైనట్లే. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ వి.శ్రీనివాసరావు నిరంతరం శ్రమిస్తున్నారు. జూన్‌ 24, 2024న ఆయన మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి రోజుకు 18 గంటలపాటు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఆయన శ్రమ ఫలితంగా సిబ్బంది సహాయ సహకారాలతో ఇప్పటికే స్వచ్ఛ కుప్పం మార్గంలో ఎన్నో విజయాలు సాధించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 13 వేల గేట్లలో (ఇళ్లు), 15 వేల కుటుంబాలు నివశిస్తున్నాయి. వీటినుంచి రోజూ 20 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అద్దె ట్రాక్టర్లకు మంగళం పలికిన అధికారులు, మున్సిపాలిటీకి ఉన్న 5 సొంత ట్రాక్టర్లతోపాటు 20 ఎలక్ట్రిక్‌ ఆటోలను చెత్త తొలగింపునకు వినియోగిస్తున్నారు. ఇవిగాక రూ.80 లక్షల వ్యయంతో ఇటీవల ఒక కాంపాక్ట్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు. 10 టన్నుల సామర్థ్యం గల గ్యాస్‌తో నడిచే ఈ వాహనాన్ని కుప్పం పట్టణంలోని పాత డంపింగ్‌ యార్డు అయిన శ్మశానం ప్రాంతంలో నిలిపి ఉంచుతున్నారు. ట్రాక్టర్లు, ఆటోలతో సేకరిస్తున్న చెత్తను ఈ వాహనంలో నింపుతారు. పూర్తిగా నిండిన తర్వాత కాంపాక్ట్‌ వాహనం బయలుదేరి మోడల్‌ కాలనీ సమీపంలోని డంపింగ్‌ యార్డుకు చెత్తను తరలిస్తుంది. దీంతో చెత్త సేకరణలో సమయం ఆదా అవుతుంది. తడిచెత్తను, పొడి చెత్తను కుటుంబాల స్థాయిలోనే వేరు చేయాలన్న నినాదం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తడిపొడి చెత్తలు క్షేత్ర స్థాయిలోనే వేరు అయి రావడంతో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ సులభతరమవుతోంది. ఇటీవలే డంపింగ్‌ యార్డులోని చెత్త మొత్తాన్ని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియతో ఎరువుగా మార్చి విక్రయించారు. అలాగే ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను సిమెంట్‌ ఫ్యాక్టరీలకు తరలించారు. రోజువారీ వస్తున్న చెత్తను వేర్వేరుగా కట్టలు కట్టి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారు. ఇలా కట్టిన కట్టల నుంచి మన్నులాంటి తడిచెత్త అక్కడే రాలిపోగా ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలు మిగిలిపోతున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు. మిగిలిన ఇతర చెత్తను ఎరువుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో డంపింగ్‌ యార్డు ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా కనిపిస్తోంది. అంతేకాదు.. మున్సిపాలిటీ పరిధిలో ఉదయం, రాత్రి రెండు వేళల్లో చెత్త తొలగిస్తున్నారు. మురుగు కాలువలను ప్రొక్లయినర్లు పెట్టి మరీ శుభ్రం చేస్తున్నారు. ఇందువల్ల చెత్త రహితమైన వీధులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.

ఫ చెత్తనుంచి సంపద సృష్టికి పథకం

చెత్తను తొలగించి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడమే కాదు, ఆ తొలగించిన చెత్తనుంచి సంపద సృష్టి కోసం పథకాలను రచిస్తున్నారు. పూల మార్కెట్‌లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పూల వ్యర్థాలను వీధుల్లో పడేయకుండా దాని నుంచి సుగంధ ధూపం, అగబత్తులు తయారు చేసే ప్లాంటును కేవలం రూ.5 లక్షల వ్యయంతో స్థాపించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్లాంటు నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. అలాగే రెసిడెన్షియల్‌ మెడికల్‌ వేస్ట్‌ను పర్యావరణానికి హాని లేకుండా కాల్చి బూడిదగా మార్చే ప్లాంటును సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడానికి పథకం రచిస్తున్నారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. లోటు బడ్జెట్టులో ఉన్న ప్రభుత్వంపై భారం వేయకుండా చెత్తనుంచి సంపద సృష్టించే ఇటువంటి ప్లాంటులను మున్సిపల్‌ నిధులతోనే నిర్మించడానికి ప్రణాళిక చేస్తున్నారు. దీంతో కంపోస్టు యార్డుకు చేరే చెత్త పరిమాణం తగ్గిపోవడమే కాకుండా మున్సిపాలిటీకి ఆదాయం లభిస్తుంది.

ఫ సీఎం ఆశయానికి అనుగుణంగా

స్వచ్ఛత, పరిశుభ్రత, పచ్చదనంతో స్థానిక సంస్థలు స్వచ్ఛాంధ్ర రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయంతోనే నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను. మున్సిపల్‌ చైర్మన్‌ సెల్వరాజ్‌, కౌన్సిలర్ల సహకారంతో నేను, సిబ్బంది రోజుకు 18 గంటలు చేస్తున్న కృషి, స్వచ్ఛాంధ్ర అవార్డుకు కుప్పం మున్సిపాలిటీ ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళలు స్వచ్ఛ కుప్పం నిర్మాణంలో ఎంతో సహకరిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే ఇళ్ల స్థాయిలోనే తడి పొడి చెత్తను వేరు చేసి అందిస్తే జీరో వేస్ట్‌ మున్సిపాలిటీగా తయారు చేయడానికి సహకరించిన వారవుతారు. రాబోయే ఆరు నెలల్లో జీరో వేస్ట్‌ మున్సిపాలిటీని తయారు చేసే లక్ష్యంతో నేను, సిబ్బంది పనిచేస్తున్నాం. ఇందుకు ప్రజలందరూ సహకరిస్తారని నమ్ముతున్నాను.

- వి.శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌, కుప్పం

Updated Date - Oct 04 , 2025 | 02:32 AM