చిన్నదైపోయిన చిత్తూరు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:32 AM
మరోసారి జిల్లాల పునర్విభజనతో చిత్తూరు మరింత చిన్నదైపోయింది. పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మదనపల్లె జిల్లాలో కలవడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.
చిత్తూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మరోసారి జిల్లాల పునర్విభజనతో చిత్తూరు మరింత చిన్నదైపోయింది. పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మదనపల్లె జిల్లాలో కలవడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల సబ్‌కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.బుధవారం ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 2022వ సంవత్సరం ఏప్రిల్‌లో చిత్తూరు జిల్లా మూడు భాగాలుగా విడిపోయాక చిత్తూరుకు 31 మండలాలే మిగిలాయి. ఆ తర్వాత చిత్తూరు మండలాన్ని రెండు(అర్బన్, రూరల్ )గా విభజించడంతో ఆ సంఖ్య 32కు చేరింది. తాజా విభజనలో భాగంగా పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల మండలాలను మదనపల్లె జిల్లాలో చేరుస్తున్నారు. దీంతో చిత్తూరులో మండలాల సంఖ్య 28కి పరిమితమైంది. విభజనకు ముందు 18.72 లక్షల జనాభా ఉండగా, ఇప్పుడు 16.43 లక్షల జనాభా మిగిలింది. రెవెన్యూ, పోలీసు డివిజన్లు మాత్రం నాలుగు అలాగే ఉన్నాయి.