మరింత చిన్నగా చిత్తూరు జిల్లా
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:48 AM
జనవరిలో మదనపల్లె జిల్లా ఆవిర్భావం కార్యాలయాల కోసం 35 భవనాల పరిశీలన రెండు జిల్లాల్లోనూ పుంగనూరు నియోజకవర్గం
చిత్తూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె జిల్లా ఏర్పాటుతో 32 మండలాలున్న చిత్తూరు జిల్లా 28 మండలాలకు తగ్గిపోనుంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మదనపల్లె జిల్లా త్వరలో ఏర్పాటు కానుంది.జనవరి 1 లేదా 2వ తేదీ నుంచి ఇక్కడినుంచి పరిపాలన సాగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆ మధ్య అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్ ఐదు రోజుల పాటు మదనపల్లెలో పర్యటించి వివిధ శాఖల కార్యాలయాల కోసం సుమారు 35 భవనాలను గుర్తించారు.
అభ్యంతరాల్లేవ్
మదనపల్లె జిల్లా ఏర్పాటుతో పాటు పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను మదనపల్లె జిల్లాలోకి కలుపుతూ, పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలుపుతూ నవంబరు 26వ తేదీన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 30 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉండగా.. ఈ ఇద్దరు కలెక్టర్లకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. మదనపల్లె జిల్లా ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈనెల 27న ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. వీలును బట్టి వెంటనే, లేదా నాలుగైదు రోజులు ఆలస్యంగానైనా ఫైనల్ గెజిట్ విడుదల చేస్తారు. అప్పటి నుంచి జిల్లా పాలన ప్రారంభమవుతుంది.
ఎక్కడ ఏ కార్యాలయం.. ప్రతిపాదనలు సిద్ధం
మదనపల్లెలో వివిధ శాఖల జిల్లా కార్యాలయాల గుర్తింపు కోసం 10 రోజుల కిందట ఉన్నతాధికారుల బృందం తీవ్రంగా గాలించింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, తహసీల్దార్ తదితరులు సుమారు ఐదు రోజులు పర్యటించి 35 భవనాలను గుర్తించారు. ఆయా భవనాల మ్యాపులు, మొత్తం కొలతల్ని సిద్ధం చేశారు. సబ్ కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా మార్చనున్నారు. జీఎంఆర్ పాలిటెక్నిక్ లేదా బీటీ కాలేజీకి అనుబంధంగా ఉన్న బీఈడీ కాలేజీలో ఎస్పీ కార్యాలయం, సీఎల్‌ఆర్‌సీ బిల్డింగులో సబ్ కలెక్టరేట్ ఏర్పాటు చేయవచ్చని ప్రతిపాదనలు పంపించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం కూడా మదనపల్లె జడ్పీ హైస్కూల్ భవనాల్ని డీఈవో కార్యాలయం కోసం పరిశీలించారు.
ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు?
జనవరి 1 లేదా 2వ తేదీన సీఎం చంద్రబాబు మదనపల్లెకు వచ్చి జిల్లాను ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసిన సందర్భంగా ప్రారంభానికి ఆయన హాజరు కావొచ్చని భావిస్తున్నారు. కొత్త సంవత్సరం కావడంతో పెన్షన్ల పంపిణీ కూడా జనవరి 1 కాకుండా డిసెంబరు 31వ తేదీనే పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరులో 28, మదనపల్లెలో 19 మండలాలు
చిత్తూరు జిల్లాలో ఇప్పుడు 32 మండలాలుండగా.. పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల మండలాలను మదనపల్లె జిల్లాలో కలుపుతున్నారు. దీంతో వాటి సంఖ్య 28కి తగ్గింది. 19 మండలాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. పీలేరులోని 6, తంబళ్లపల్లెలోని 6, పుంగనూరులోని 4, మదనపల్లెలోని 3 మండలాలతో కొత్త జిల్లా స్వరూపం ఉండనుంది.