Share News

చిత్తూరు డీసీసీబీ విభజన!

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:09 AM

వందేళ్ళకు మించి చరిత్ర కలిగి సహకార రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) విభజనకు లోనుకానుంది.

చిత్తూరు డీసీసీబీ విభజన!

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వందేళ్ళకు మించి చరిత్ర కలిగి సహకార రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) విభజనకు లోనుకానుంది.రాష్ట్రవ్యాప్తంగా 13 డీసీసీబీలుండగా ప్రాథమికంగా చిత్తూరు, కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లోని నాలుగు వెరసి ఆరు డీసీసీబీల విభజనకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.తొలిదశలో ఆరు డీసీసీబీలను 12గా విభజించి, వాటి పనితీరును పరిశీలించాక మిగిలిన ఏడు డీసీసీబీలను విభజించనున్నట్లు సమాచారం.

2022 ఏప్రిల్‌లో జిల్లాల పునర్విభజన జరిగింది. కానీ అప్పట్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌ (జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) విభజన జరగలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోనే డీసీసీబీ, సీడీసీఎంఎస్‌ కొనసాగుతున్నాయి.పరిపాలనా సౌలభ్యం కోసం డీసీసీబీలను పునర్వ్యవస్థీకరించాలని సహకారశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాకొక డీసీసీబీని ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం చిత్తూరులో కొనసాగుతున్న డీసీసీబీ పరిధిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 75 సింగిల్‌ విండోలు(ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు)న్నాయి, 40 బ్యాంకు శాఖలున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో డీసీసీబీ తరపున డీజీఎం స్థాయి అధికారులకు కార్యాలయం ఏర్పాటు చేశారు.అక్కడి కలెక్టర్లు జరిపే జిల్లాస్థాయి సమావేశాలకు ఆయా అధికారులు హాజరవుతున్నారు. ప్రస్తుత చిత్తూరు డీసీసీబీ పరిధిలో 75 సింగిల్‌ విండోలుండగా, జిల్లాలవారీగా చిత్తూరులో 37, తిరుపతిలో 23, అన్నమయ్యలో 15 విండోలు కొనసాగుతున్నాయి. బ్యాంకు శాఖలవారీగా చిత్తూరులో 20, తిరుపతిలో 14, అన్నమయ్యలో 6 బ్యాంకు శాఖలున్నాయి.చాలా సంవత్సరాలుగా ఎన్నికలు జరక్కపోవడంతో మొన్నటి వరకు త్రిసభ్యకమిటీలతో సింగిల్‌ విండోలు, సెవెన్‌మెన్‌ కమిటీతో డీసీసీబీ, సీడీసీఎంఎ్‌స కొనసాగాయి. తాజాగా ప్రభుత్వం సింగిల్‌ విండోలకు త్రిసభ్య కమిటీలను వేయగా, డీసీసీబీ, సీడీసీఎంఎ్‌సలకు పర్శన్‌ ఇన్‌చార్జులను చైర్మన్లుగా నియమించింది. త్వరలో సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది. డీసీసీబీలను విభజించి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది, లేదా ఉమ్మడి జిల్లా డీసీసీబీలకు ఎన్నికలు జరిపి, ఆ తర్వాత విభజిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.అయితే సహకార శాఖ ఉన్నతాధికారుల సంకేతాల ప్రకారం ఎన్నికలకు ముందే తొలి, మలి దశల్లో డీసీసీబీలను విభజించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుపతికి కొత్త డీసీసీబీ

డీసీసీబీ విభజన జరిగితే తిరుపతి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏర్పాటుకు ఇప్పటినుంచే చర్యలు ప్రారంభిస్తే ఎన్నికల నాటికి ఒక కొలిక్కి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లాను మాత్రం చిత్తూరు డీసీసీబీలోనే కొనసాగించనున్నారు. విభజన జరిగితే తిరుపతి జిల్లాకు కొత్తగా అధికారులు, ఉద్యోగుల సర్దుబాట్లు, కార్యాలయ భవనాలు, సమావేశ మందిరాలు ఏర్పాటు చేయాల్సివుంటుంది. కాగా తిరుపతిలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం రెండువేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ను బ్యాంకు అధికారులు కోరినట్లు సమాచారం.

Updated Date - Jul 22 , 2025 | 01:09 AM