Share News

చింటూ రక్త చరిత్ర

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:50 AM

కఠారి అనురాఽధ దంపతుల హత్య కేసులో ఉరి శిక్ష పడిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురికి ఇదే తొలి నేరం కాగా.. ఇద్దరికి అప్పటికే నేర చరిత్ర ఉంది.

 చింటూ రక్త చరిత్ర
చింటూ

చిత్తూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):కఠారి అనురాఽధ దంపతుల హత్య కేసులో ఉరి శిక్ష పడిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురికి ఇదే తొలి నేరం కాగా.. ఇద్దరికి అప్పటికే నేర చరిత్ర ఉంది. ప్రధాన నిందితుడు చింటూ తన మేనమామ కఠారి మోహన్‌ కోసం అప్పటి ఎమ్మెల్యే సీకే బాబు మీద రెండుసార్లు హత్యాయత్నం చేయగా.. ఏ2 వెంకటాచలపతి ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. చింటూ వద్ద పనులు చేసుకునే మిగిలిన ముగ్గురికీ గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఐదుగురు నేరస్థుల్లో నలుగురికి పెళ్లి కాలేదు.

రెండుసార్లు సీకేపై హత్యాయత్నం

శ్రీరామ చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ (55) కఠారి మోహన్‌కు మేనల్లుడు. ముంబాయిలో మెరైన్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. అప్పటి ఎమ్మెల్యే సీకే బాబుతో మేనమామకు నిత్యం గొడవలు జరుగుతుండడంతో.. ఆయనకు అండగా వుండడంకోసం ఉద్యోగాన్ని వదిలేసి 2006లో చిత్తూరు వచ్చేశాడు. 2007లో సీకే బాబుపై ఎమ్మెస్సార్‌ సర్కిల్‌ సమీపంలోని క్లబ్‌ వద్ద హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కఠారి మోహన్‌, చింటూల మీద కేసు నమోదైంది. తర్వాత కాలంలో కోర్టు ఈ కేసును కొట్టేసింది. అదే ఏడాది డిసెంబరు 31న కట్టమంచి సాయిబాబా గుడి ఎదురుగా కూడా సీకే బాబు మీద మరోసారి హత్యాయత్నం జరిగింది. బాంబు దాడిలో సీకే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరగా, గన్‌మ్యాన్‌ మరణించారు. ఇక్కడా మోహన్‌, చింటూలపై కేసు నమోదు చేయగా, చింటూకు మాత్రం కోర్టు జీవితఖైదు విధించింది. తర్వాత హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.

ఏ2 వెంకటాచలపతి (61) కర్ణాటక రాష్ట్రం ముళ్‌బాగళ్‌కు చెందినవాడు. కఠారి మోహన్‌కు అక్కడ బంధువులుండడంతో వెళ్తూ వుండేవారు. ఆయనతో పాటు చింటూ కూడా వెళ్లేవారు. అక్కడ చింటూతో వెంకటాచలపతికి పరిచయమైంది. 2007లో క్లబ్‌ వద్ద సీకే బాబు మీద జరిగిన హత్యాయత్నం కేసులో ఇతను కూడా నిందితుడిగా ఉన్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉండగా, 2007కు ముందు ఆ రాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసేవాడు.

ఏ3 జయప్రకా్‌షరెడ్డి (33) చిత్తూరు నగరం గంగనపల్లె ప్రాంతానికి చెందినవాడు. చింటూ వద్ద ఆఫీసు బాయ్‌గా పనిచేసేవాడు. ఇతడి తండ్రి ఆటో డ్రైవర్‌.

ఏ4 మంజునాథ్‌ (37) గంగవరం మండలం మారేడుపల్లెకు చెందినవాడు. చింటూ వద్ద వంట మనిషిగా పనిచేసేవాడు. కుక్కల్ని కూడా చూసుకునేవాడు.

ఏ5 వెంకటేష్‌ (49) చిత్తూరు నగరం గంగనపల్లెకు చెందినవాడు. చింటూ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు.

ఉరి శిక్ష పడ్డ వారిలో నలుగురికి పెళ్లి కాలేదు. ముళబాగళ్‌కు చెందిన వెంకటాచలపతికి మాత్రమే పెళ్లయి ఓ కుమార్తె ఉంది.ఏ3 జయప్రకా్‌షరెడ్డి 23 ఏళ్ల వయసు నుంచి, ఏ4 మంజునాథ్‌ 27 ఏళ్ల వయసు నుంచీ జైల్లోనే ఉంటున్నారు.

పొట్ట కూటి కోసం వచ్చిన ఆ ముగ్గురు

ఏ3, ఏ4, ఏ5 జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్‌, వెంకటేష్‌ ప్రధాన నిందితుడు చింటూ వద్ద పొట్ట కూటి కోసం పనిలో చేరారు. అతని వద్ద రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ ముగ్గురికీ గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. యజమాని వద్ద మెహర్బానీ కోసం హత్య కేసులో భాగస్వాములై జీవితాలను నాశనం చేసుకున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 01:51 AM