Share News

స్వగ్రామంలో ముఖ్యమంత్రి

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:13 AM

కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడి సంవత్సరీకానికి హాజరైన చంద్రబాబు

స్వగ్రామంలో ముఖ్యమంత్రి
సంవత్సరీక పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, ఇందిర, నారా లోకేశ్‌, గిరీష్‌, రోహిత్‌

చంద్రగిరి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): సోదరుడి సంవత్సరీకానికి హాజరైన సీఎం చంద్రబాబు మూడు గంటలపాటు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో గడిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికోసం ఆయన ఉండవల్లిలోని నివాసం నుంచి హెలిప్యాడ్‌లో బయలుదేరి మంగళవారం ఉదయం 11.20 గంటలకు ఎ.రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గాన 11.30 గంటలకు నారావారిపల్లెలోని ఇంటికి వచ్చారు. ఇంట్లో నారా రామ్మూర్తి నాయుడికి విస్తర (11వనెల బట్టలు పెట్టడం) కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌, రామ్మూర్తి నాయుడి సతీమణి ఇందిర, కుమారులు నారా గిరీష్‌, నారా రోహిత్‌, సీఎం సోదరి హైమావతి, ఇతర కుటుంబ సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు రామ్మూర్తి నాయుడి ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. అక్కడ్నుంచి 12.55 గంటలకు ఇంటికి బయలుదేరారు. సీఎం ఇంటి ముందున్న వందలాది మంది ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. దాదాపు అరగంట పాటు ప్రజలతో ఉన్నారు. అనంతరం ఇంటిలోపలకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం 2.10 గంటలకు హెలిప్యాడ్‌కు బయలుదేరారు. ఆ సమయంలోనూ ఇంటి ముందున్న బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎ.రంగంపేట నుంచి హెలికాప్టర్‌లో సీఎం, మంత్రి లోకేశ్‌ ఉండవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం సతీమణి నారా భువనేశ్వరి రోడ్డు మార్గంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాదు వెళ్లారు.

Updated Date - Oct 08 , 2025 | 01:13 AM