Share News

గజదాడులకు ఇక చెక్‌: పీసీసీఎఫ్‌ శ్రీధర్‌

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:15 AM

గజదాడుల నివారణ నిమిత్తం కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీల కోసం క్యాంపు

గజదాడులకు ఇక చెక్‌: పీసీసీఎఫ్‌ శ్రీధర్‌
ఎలిఫెంట్‌ క్యాంప్‌లో ఓ కుంకీ వద్ద పీసీసీఎఫ్‌ శ్రీధర్‌, అటవీశాఖ అధికారులు

పలమనేరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం కష్టపడి రైతులు పండిస్తున్న పంటలను తొక్కి నష్టపరుస్తున్న మదపుటేనుగులను ఇకపై శాంక్చురీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలకే పరిమితం చేస్తామని పీసీసీఎఫ్‌ (వైల్డులైఫ్‌) డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.గజదాడుల నివారణ నిమిత్తం కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీల కోసం పలమనేరు సమీపంలోని ముసలి మడుగు వద్ద ఏర్పాటు చేసిన క్యాంపును ఆయన మంగళవారం సందర్శించారు.కుంకీలకోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలిఫెంట్‌క్యాంపులో కుంకీలకోసం నిర్మించిన నీటికుంటలో స్నానం చేస్తున్న కుంకీని ఆయన పరిశీలించారు.కుంకీలకోసం తయారు చేసిన సంగటి ముద్దలను కూడా పరిశీలించారు. ప్రస్తుతం కుంకీలకోసం వెటర్నరీ క్లీనిక్‌ వుందని, త్వరలో వెటర్నరీ ఆస్పత్రి కూడా నిర్మిస్తున్నామని, కుంకీలను సంరక్షించే మావటీలకు ప్రస్తుతం రెండు క్యార్టర్స్‌ నిర్మిస్తున్నామని ఆయనకు అధికారులు తెలిపారు.ఎలిఫెంట్‌ క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే వైర్‌లెస్‌ సెట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్‌ శ్రీధర్‌ సూచించారు. రెండ్రోజుల క్రితం టేకుమంద అటవీప్రాంతంలో ఉన్న 14 ఏనుగుల గుంపును కుంకీలైన కృష్ణ, జయంత్‌, వినాయక్‌ ద్వారా ఎలిఫెంట్‌ శాంక్చురీకి తరలించిన వైనాన్ని అడిగి తెలుసుకొన్నారు.ఇక జిల్లాలో పంటలను ఏనుగులు నాశనం చేసే పరిస్థితులు తలెత్తకుండా వాటిని పూర్తిగా ఎలిఫెంట్‌ శాంక్చురీ లోతట్టుప్రాంతాలకు కుంకీల ద్వారా మళ్లించాలని సూచించారు.ఈ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను అటవీ శాఖ అధికారులకు వివరించారు. సోమల మండలంలో ఇటీవల ఒక రైతును దాడి చేసి చంపివేసిన ఏనుగుల గుంపును కూడా పలమనేరు ఎలిఫెంట్‌ శాంక్చురీ లోతట్టుకు తరలించడానికి చర్యలు తీసుకొంటున్నామని అటవీశాఖ అధికారులు డాక్టర్‌ శ్రీధర్‌కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం కన్జర్వేటర్‌ యశోదాబాయి, తిరుపతి కన్జర్వేటర్‌ సెల్వం, జిల్లా అటవీశాఖ అధికారిణి భరణి, పలమనేరు సబ్‌ డీఎ్‌ఫవో వేణుగోపాల్‌, రేంజర్‌ నారాయణ, రిటైర్డు ఫారెస్టు రేంజర్‌ రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 01:15 AM