Share News

ఫైళ్ల క్లియరెన్సులో చకచక

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:51 AM

తిరుపతి కలెక్టరేట్‌లో ఇ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు వేగంగా జరుగుతోంది. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల వద్ద ఆరు నెలల కాలంలో పెండింగు పడిన ఫైళ్ళ సంఖ్య సున్నా. కలెక్టర్‌ వద్దకు వస్తున్న ఫైళ్ళను క్లియర్‌ చేయడంలో కనిష్ఠంగా ఒకటిన్నర రోజు నుంచీ గరిష్ఠంగా రెండున్నర రోజుల వ్యవధి తీసుకుంటున్నారు. పైళ్ల క్లియరెన్సులో మంత్రులు, సెక్రటరీలు (ఐఏఎస్‌), సెక్రటరియేట్‌ డిపార్ట్‌మెంట్‌ వారీగా, హెచ్‌వోడీ్‌సలతో పాటు కలెక్టర్‌, జేసీలు ఏ స్థానంలో ఉన్నారో ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

ఫైళ్ల క్లియరెన్సులో చకచక

గరిష్ఠంగా రెండున్నర రోజుల్లో క్లియర్‌

కలెక్టర్‌, జేసీ వద్ద జీరో పెండింగ్‌

తిరుపతి కలెక్టరేట్‌లో ఇ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు వేగంగా జరుగుతోంది. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల వద్ద ఆరు నెలల కాలంలో పెండింగు పడిన ఫైళ్ళ సంఖ్య సున్నా. కలెక్టర్‌ వద్దకు వస్తున్న ఫైళ్ళను క్లియర్‌ చేయడంలో కనిష్ఠంగా ఒకటిన్నర రోజు నుంచీ గరిష్ఠంగా రెండున్నర రోజుల వ్యవధి తీసుకుంటున్నారు. పైళ్ల క్లియరెన్సులో మంత్రులు, సెక్రటరీలు (ఐఏఎస్‌), సెక్రటరియేట్‌ డిపార్ట్‌మెంట్‌ వారీగా, హెచ్‌వోడీ్‌సలతో పాటు కలెక్టర్‌, జేసీలు ఏ స్థానంలో ఉన్నారో ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

గత మూడు నెలలు, ఐదు నెలల వ్యవధిలో రెండు దశలుగా ఫైళ్ల క్లియరెన్సు తీరును ప్రభుత్వం పరిశీలించింది. జిల్లాకు సంబంధించి గత సెప్టెంబరు 9వ తేదీ నుంచీ ఈనెల 9వ తేదీ వరకూ మూడు నెలల కాలంలో కలెక్టర్‌ వద్దకు 843 ఫైళ్లు రాగా వాటిలో 740 క్లియర్‌ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉండగా, ఒక్క ఫైలు కూడా పెండింగులో లేదు. ఈ ఫైళ్ళను క్లియర్‌ చేయడానికి సగటున కలెక్టర్‌ తీసుకున్న వ్యవధి 44 గంటల 16 నిమిషాలు. గత జూలై 15వ తేదీ నుంచీ ఇప్పటి దాకా ఐదు నెలల కాలంలో అయితే కలెక్టర్‌కు 3704 ఫైళ్లు వచ్చాయి. వీటిలో 3616 పైళ్లను క్లియర్‌ చేయగా మిగిలినవి వేర్వేరు దశల్లో వున్నాయి. ఈ వ్యవధిలో కూడా ఫైళ్ళ పెండింగు జీరో. కాగా ఫైళ్ల క్లియరెన్స్‌కు కలెక్టర్‌ సగటున తీసుకున్న వ్యవధి 57 గంటలు. కలెక్టర్‌కు పరిశ్రమలు, పర్యాటకం, ఇరిగేషన్‌, రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు సహా అనేక శాఖలకు చెందిన కీలక ఫైళ్లు వస్తుంటాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లాలో ఈ తరహా ఫైళ్లు కలెక్టర్‌ వద్దకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. దానికి ఇక్కడి కలెక్టర్‌కు ప్రొటోకాల్‌ విధుల కోసం రోజులో అధిక సమయం కేటాయించే పరిస్థితి. అంత ఒత్తిడిలోనూ ఫైళ్ళ క్లియరెన్సు వేగంగా చేస్తుండడం గమనార్హం.

జేసీ వద్దా చకచకా

ఇక జాయింట్‌ కలెక్టర్‌ విషయానికి వస్తే గత మూడు నెలల్లో 110 ఫైళ్లు వచ్చాయి. వాటిలో 102 ఫైళ్లను క్లియర్‌ చేశారు. మిగిలినవి వివిధ దశల్లో వున్నాయి. జేసీ వద్ద ఫైళ్ల పెండింగ్‌ జీరో. అలాగే ఫైళ్ళు క్లియర్‌ చేయడానికి జేసీ తీసుకుంటున్న సగటు వ్యవధి 24 గంటల 11 నిమిషాలు. సాధారణంగా జేసీ వద్దకు భూసేకరణ, 22ఏ జాబితాకు సంబంధించిన భూముల ఫైళ్లు ఎక్కువగా వస్తాయి. ఇతర శాఖల నుంచీ వచ్చే ఫైళ్లు దాదాపుగా ఏమీ వుండవు. మొత్తమ్మీద జిల్లాలో ఇ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు త్వరితగతిన జరుగుతున్నట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి వెల్లడించిన ఈ తరహా నివేదికల వల్ల ఇ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు మరింత వేగంగా జరిగే అవకాశముందని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 11 , 2025 | 01:51 AM