ఓ ఇంటివాడవుతున్న చంద్రబాబు!
ABN , Publish Date - May 15 , 2025 | 01:59 AM
కుప్పం సమీపంలోని శాంతిపురం మండల పరిధిలో నిర్మిస్తున్న సొంత గృహప్రవేశం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 25వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.
25న కుటుంబ సమేతంగా గృహప్రవేశం
ఏర్పాట్లను పరిశీలించిన నారా బ్రాహ్మణి
కుప్పం, మే 14 (ఆంధ్రజ్యోతి): కుప్పం సమీపంలోని శాంతిపురం మండల పరిధిలో నిర్మిస్తున్న సొంత గృహప్రవేశం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 25వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.24వ తేదీన కుప్పం రానున్న ఆయన మరుసటి రోజున సకుటుంబంగా స్వగృహ ప్రవేశం చేయనున్నారు. ఇంటి నిర్మాణ ఏర్పాట్లను చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి బుధవారం పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకోవాలని తలిచారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019-2024 మధ్య కాలంలో స్థలంకోసం ఆయన టీమ్ తరఫున స్థానిక నాయకులు అన్వేషణ సాగించారు. చివరకు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ, శివపురం గ్రామ పరిధిలో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతులకోసం పలమనేరు, కుప్పం, మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీకేయం ఉడా)కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు చాలాకాలం వరకు అనుమతి లభించలేదు. నాటి వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో కారణాలేవీ చూపకుండానే పీకేఎం ఉడా అధికారులు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేశారు. చివరకు అనుమతులు నిరాకరించారు. తాను ఏర్పాటు చేసిన సంస్థ అన్యాయంగా అనుమతులు నిరాకరించడంతో చంద్రబాబు ఆగ్రహానికి లోనయ్యారు. చివరకు కోర్టులో కేసు వేయడంతో 2023లో కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు వద్దకు వచ్చి మరీ ఆయన సంతకం తీసుకుని పీకేఎం ఉడా అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు.
ఫశరవేగంగా నిర్మాణం
పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలో చంద్రబాబు స్వృగృహ నిర్మాణం ప్రతిపక్షంలో కొంచెం నత్తనడకన నడిచింది. అయితే 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి కాగానే నిర్మాణంలో వేగం పెరిగింది. ఇంకా తుది మెరుగులు దిద్దాల్సి ఉంది కానీ దాదాపు ఇంటి నిర్మాణం పూర్తయింది. దీంతో చంద్రబాబు స్వగృహ ప్రవేశానికి 25వ తేదీన ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి బృందం రెండుమూడు రోజుల క్రితమే కుప్పంలో దిగిపోయింది. తుదిమెరుగులు శరవేగంగా దిద్దడంతోపాటు గృహప్రవేశానికి అవసరమైన ఏర్పాట్లను ఆ బృందం పర్యవేక్షిస్తోంది. స్థానికంగా ఏదైనా అవసరమైతే తప్ప తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఇందులో జోక్యం కల్పించుకునే అవకాశం ఇవ్వడంలేదు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన బ్రాహ్మణి
కడపల్లె వద్ద ఇంటిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం 9 గంటలకు ఇంటివద్దకు చేరుకున్న ఆమె 11 గంటలదాకా అక్కడే గడిపారు.ఇంటి పనులను పరిశీలించడంతోపాటు, 25న జరుగనున్న గృహప్రవేశ ఏర్పాట్లపై కూడా ఆమె భువనేశ్వరి బృందంతో చర్చించినట్లు సమాచారం. ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమైన బ్రాహ్మణి తన పర్యటన గురించి పార్టీలోని అత్యున్నత స్థాయి నేతలకు తప్ప వేరెవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఎస్పీ మణికంఠ , డీఎస్పీ పార్థసారథి బుధవారం చంద్రబాబు ఇంటి వద్ద భద్రతా ఏర్పాటను పరిశీలించారు. ప్రజా సమూహం ఎక్కువగా కేంద్రీకృతమయ్యే ప్రాంతాలు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పార్కింగ్ ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ, అంబులెన్స్‌లు తదితర సౌకర్యాలపై సమీక్షించారు. మరోవైపు టీడీపీ శాంతిపురం మండల అధ్యక్షుడు విశ్వనాథ నాయుడి ఆధ్వర్యంలో ఆహూతుల వాహనాల పార్కింగ్‌కోసం స్థలాన్ని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. అయితే చంద్రబాబు ఇంటి పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.గృహప్రవేశం నాడు సుమారు 10 వేల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, అదే సమయంలో భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.