Share News

జనగణనకు జేగంట

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:45 AM

పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కలతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దేశించిన పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలే కీలకం. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, పాలనాసౌలభ్యం, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు ఇది దోహదం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యం కల్గిన జనగణన 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. కోవిడ్‌ తగ్గుముఖం పట్టాక సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ అంశం పక్కకు వెళ్లింది. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం జనగణనకు జేగంట కొట్టింది. 16వ జనాభా లెక్కల సర్వే నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈసారి జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టడం ప్రత్యేకం.

జనగణనకు జేగంట

  • 16వ జనాభా లెక్కల సర్వేకు సమాయత్తం - ఈసారి కులగణన కూడా

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కలతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దేశించిన పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలే కీలకం. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, పాలనాసౌలభ్యం, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు ఇది దోహదం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యం కల్గిన జనగణన 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. కోవిడ్‌ తగ్గుముఖం పట్టాక సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ అంశం పక్కకు వెళ్లింది. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం జనగణనకు జేగంట కొట్టింది. 16వ జనాభా లెక్కల సర్వే నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈసారి జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టడం ప్రత్యేకం.

నూతన జిల్లా ప్రాతిపదికన

చివరిసారిగా 2011లో నిర్వహించిన జనాభా లెక్కల సర్వేకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదిక అయ్యింది. ఈసారి నూతన జిల్లా ప్రాతిపదికన సర్వే జరగనుంది. ప్రస్తుత జిల్లా జనాభా 18.73 లక్షలు (అంచనా). ఇందులో పురుషులు 9.40లక్షలు , మహిళలు 9.33 లక్షలు.

కాగిత రహితం..ప్రజలే గణకులు

ఇప్పటివరకు నిర్వహించిన జనాభా లెక్కల సర్వేల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారు. వారే గణకులుగా ప్రతి ఇంటినుంచి లెక్కలు సేకరించారు. దీనికితోడు ఆరునెలల నుంచి ఏడాదిపాటు జరిగే సర్వేకు ఉమ్మడి జిల్లాలో వందల టన్నుల కాగితం వినియోగించాల్సి వచ్చేది. తాజాగా జరగనున్న 16వ జనాభాలెక్కల సేకరణ కాగితరహితంగా డిజిటల్‌ యాప్‌ల ద్వారా సర్వే చేపట్టనున్నారు. ఉపాధ్యాయులకు తోడు ప్రజలే గణకులుగా మారబోతున్నారు. సర్వేలో స్వీయధ్రువీకరణతో ప్రజలే వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పర్యవేక్షణలో జన, కులగణన సర్వే నిర్వహించనున్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి ఈ సర్వే చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్‌ త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. ఏ విధంగా జనగణన చేయాల్సిన అంశాలపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు ఆతర్వాత విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా జనాభా వివరాలు

సంవత్సరం సంఖ్య

1911 11,77,000

1921 12,04,000

1931 13,31,000

1941 14,97,000

1951 16,66,000

1961 19,15,000

1971 23,37,000

1981 27,27,000

1991 32,60,000

2001 37,35,202

2011 41,78,061

ప్రస్తుతం కొత్త జిల్లా ప్రాతిపదికన జనాభా సంఖ్య 18,73,000 (అంచనా)

Updated Date - Jun 25 , 2025 | 01:45 AM